శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2016 (03:14 IST)

చెన్నై అపోలో ఆస్పత్రి వద్ద టెన్షన్.. టెన్షన్... అమ్మ ఆరోగ్యంపై నోరు మెదపని గవర్నర్...

చెన్నైలోని అపోలో ఆస్పత్రి వద్ద టెన్షన్.. టెన్షన్ వాతావరణం నెలకొనివుంది. ఆదివారం గుండెపోటుకు గురైన ముఖ్యమంత్రి జయలలితను చూసిన రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు.. అమ్మ ఆరోగ్యంపై ఎలాంటి ప

చెన్నైలోని అపోలో ఆస్పత్రి వద్ద టెన్షన్.. టెన్షన్ వాతావరణం నెలకొనివుంది. ఆదివారం గుండెపోటుకు గురైన ముఖ్యమంత్రి జయలలితను చూసిన రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు.. అమ్మ ఆరోగ్యంపై ఎలాంటి ప్రకటన చేయకుండానే మౌనంగా రాజ్‌భవన్‌కు వెళ్లిపోయారు. దీంతో అన్నాడీఎంకే శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొనివుంది. 
 
అయితే, జయలలిత గుండెపోటు వార్త విన్నప్పటి నుంచీ అర్థరాత్రి 3 గంటలవరకూ 'అమ్మ' జయలలిత అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆస్పత్రికి తరలివస్తున్నారు. ఆదివారం సాయంత్రం జయలలితకు గుండెపోటు రావడంతో ఆమెను స్పెషల్ వార్డు నుంచి ఐసీయూకు షిఫ్ట్ చేసి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం కుదుట పడిందని, అమ్మ త్వరలో ఇంటికి వెళ్లిపోతారని ఇటీవల కథనాలు రాగా.. ఆమెకు గుండెపోటు రావడంతో అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
 
మరోవైపు.. జయలలిత గుండెపోటు వార్తను తెలుసుకున్న తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు ముంబై నుంచి అపోలో ఆస్పత్రికి వచ్చి జయలలిత ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పది నిమిషాలపాటు ఆస్పత్రిలో ఉన్న గవర్నర్.. మీడియాతో జయ ఆరోగ్యంపై మాట్లాడేందుకు నిరాకరించారు. జయ పరిస్థితిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం, ఆమె ఆరోగ్యంపై స్పందించకుండానే రాజ్‌భవన్‌కు వెళ్లిపోయారు. రాజ్‌భవన్ నుంచి ఏ వార్త వినాల్సి వస్తుందోనని జయలలిత అభిమానుల్లో కలవరం మొదలైంది. 
 
ఇంకోవైపు.. ఎలాంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందోనని భావించిన కేంద్ర ప్రభుత్వం భారీగా బలగాలను రప్పించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీగా పోలీసులను ఆస్పత్రి వద్ద మోహరించింది. ఆ చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్లు, హోటల్స్‌లో ఉన్న వారిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. 11 కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను అధికారులు సిద్ధం చేశారు. టోల్‌ప్లాజాలు, హైవేలపై పోలీసులు బందోబస్తు చేపట్టారు.