దేశంలో ఐదో కరోనా టీకా.. జాన్సన్ అండ్ జాన్సన్‌కు ఓకే
దేశంలో మరో కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సింగిల్ డోసు కోవిడ్ టీకాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అత్యవసర వినియోగం కింద ఆ టీకాలను ఇవ్వవచ్చు అని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తన ట్విట్టర్‌లో వెల్లడించారు. దీంతో భారత్ తన వ్యాక్సిన్ సామర్థ్యాన్ని పెంచేసింది.
జాన్సన్ అండ్ జాన్సన్‌కు అత్యవసర వినియోగం కోసం ఆమోదం దక్కడంతో.. భారత్‌లో వినియోగించనున్న ఐదో టీకా కానుంది. యురోపియన్ యూనియన్ ఏజెన్సీ ఆమోదం పొందిన 5 టీకాలు మన వద్ద ఉన్నట్లు మంత్రి తన ట్విట్టర్‌లో తెలిపారు.
జాన్సన్ సింగిల్ డోసు రాకతో.. కోవిడ్‌పై పోరాటం మరింత బలోపతం అవుతుందని మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా కోవాగ్జిన్, కోవీషీల్డ్, స్పుత్నిక్, మోడెర్నా టీకాల అత్యవసర వినియోగానికి ఆమోదం దక్కిన విషయం తెలిసిందే.
కాగా, వ్యాక్సిన్ అనుమతి కోసం కేంద్రంతో చర్చలు జరుపుతున్నట్లు ఇప్పటికే జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ప్రకటించింది. అత్యవసర వినియోగానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పింది. ఇప్పటికే బయోలాజికల్-ఈ సంస్థతో జాన్సన్ అండ్ జాన్సన్ ఒప్పందం చేసుకుంది.