శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 4 జులై 2015 (10:52 IST)

'సుష్మా' వ్యవహారంపై విచారణకు పార్లమెంటరీ కమిటీ.. మోడీ సర్కారు నిర్ణయం

ఐపీఎల్ మాజీ ఛైర్మన్, వివాదాస్పద వ్యాపారి లలిత్ మోడీకి కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ చేసిన సాయంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు ఒక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి వివాచరణ జరిపించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. తద్వారా వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడటమేకాకుండా, విపక్షాలను శాంతింపజేయవచ్చన్నది ఆయన వ్యూహాంగా ఉంది. 
 
'లలిత్ గేట్' అంశంలో సంబంధం ఉన్న సుష్మా స్వరాజ్‌తో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేలను పదవుల నుంచి తొలగించాలని లేనిపక్షంలో ఈనెలలో ప్రారంభమయ్యే వర్షాకాల పార్లమెంట్ సమావేశాలను సజావుగా సాగనివ్వబోమని విపక్షపార్టీలు ప్రకటించడంతో మోడీ సర్కారు అప్రమత్తమైంది. ఈ అంశంపై ఓ మెట్టు దిగాలని సర్కార్‌ భావిస్తున్నట్లు సమాచారం. 
 
లలిత్‌ మోడీకి వ్యక్తిగత స్థాయిలో రాజస్థాన్‌ సీఎం వసుంధర రాజే సహాయం చేసినప్పటికీ సుష్మా తన అధికార హోదాను దుర్వినియోగం చేశారని బీజేపీ నేతలు సైతం అంతర్గతంగా అంగీకరిస్తున్నారు. లలిత్‌ వీసా సాయం కోరితే హైకమిషనర్‌ ద్వారా ప్రతిపాదన తెప్పించుకుని సాయపడితే పరిస్థితి వేరుగా ఉండేదని, ఆమె నేరుగా బ్రిటన్‌ అధికారులతో మాట్లాడి వీసా ఇప్పించడమే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసిందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో లలిత్‌ మోడీకి సుష్మా సహాయంపై నివేదిక ఇచ్చేందుకు పార్లమెంటరీ కమిటీని ఏర్పాటుచేసే అవకాశముందని భోగట్టా. తద్వారా విపక్షాలను శాంతపరచి జీఎస్‌టీ, ఇతర బిల్లులను ఆమోదింపజేసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. పైగా.. సుష్మాకు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. 
 
అందువల్ల పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయడం వల్ల ఆమె కూడా శాంతించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. తద్వారా ఈ పార్లమెంట్ సమావేశాల నుంచి గట్టెక్కాలని బీజేపీ భావిస్తోంది. ఒకవేళ పార్లమెంట్ కమిటీ నివేదిక సుష్మా శైలిని తప్పుబట్టినట్టయితే అపుడు ఆమెను మంత్రపదవి నుంచి తొలగించాలన్న యోచనలో మోడీ ఉన్నట్టు తెలుస్తోంది.