శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 25 మార్చి 2017 (04:04 IST)

ఉన్న ఏటీఎంలను తీసేస్తున్నారు. కొత్త ఎటీఎంలు ఉండవ్.. పదివేల విత్‌డ్రాకే పరిమితం

విశ్వసనీయ సమాచారం ప్రకారం వీలైనంత మేరకు ఏటీఎం కేంద్రాలను కుదించుకోవాలని, అవసరం లేని చోట్ల మూసి వేయాలని రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను ఆదేశించింది.

పెద్ద నోట్ల రద్దు తర్వాత ఫిబ్రవరి నెల నుంచి కాస్త సడలింపు వచ్చినప్పటికీ బ్యాంకుల్లో మళ్లీ డబ్బు నిండుకోవడంతో బెంబేలెత్తిపోయిన జనాలకు మాడు పగులకొడుతూ రిజర్వ్ బ్యాంకు పిడుగుపాటు నిర్ణయాలు తీసుకున్న విషయం కాస్త ఆలస్యంగా బయటపడింది. ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్చి నెల మొత్తంగా బ్యాంకులు ఖాతాదారులకు అడిగినంత డబ్బు ఇవ్వలేకపోవడానికి కారణం ఏమిటని మీడియా రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నప్పటికీ అసలు విషయం మాత్రం ఇప్పుడే బయటపడింది.


విశ్వసనీయ సమాచారం ప్రకారం వీలైనంత మేరకు ఏటీఎం కేంద్రాలను కుదించుకోవాలని, అవసరం లేని చోట్ల మూసి వేయాలని రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను ఆదేశించింది. తాను స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చేదాకా ఏటీఎంల్లో నగదును నింపవద్దని, కొన్ని ఏటీఎంలలో మాత్రమే పరిమితంగా నగదు ఉంచాలని ఫిబ్రవరి రెండో వారంలోనే రిజర్వ్ బ్యాంకు సూచించినట్లు సమాచారం. అందువల్లే ఫిబ్రవరి చివరి వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో 90 శాతం ఏటీఎంలు పనిచేయడం మానేశాయి. అక్కడక్కడా ఏటీఎంలలో నగదు పరిమితంగా లోడ్‌ చేస్తుండటంతో గంటలోపే ఖాళీ అవుతున్నాయి.
 
ఏటీఎంలలో నగదు విత్‌డ్రా పరిమితిని ఎత్తేస్తున్నామని ప్రకటించిన రిజర్వు బ్యాంకు... వాటికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తామని, అప్పటిదాకా ఏటీఎంల్లో నగదు ఉంచే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకర్లకు అంతర్గతంగా సూచించింది. ఈ మేరకు బ్యాంకులు వాటికి అనుబంధంగా ఉండే ఏటీఎంలలోనూ డబ్బు లోడ్‌ చేయడం లేదు. ఆర్‌బీఐ లైసెన్స్‌ ఉండే ఏజెన్సీలు కూడా కొంతకాలంగా ఏటీఎంల్లో నగదు లోడ్‌ చేయడం లేదు. ఫలితంగా ఖాతాదారులు ప్రతి చిన్న అవసరానికి బ్యాంకులకు వెళ్లాల్సి వస్తోంది.
 
పెద్దనోట్ల రద్దు సంక్షోభం కాస్త తగ్గుముఖం పట్టాక సేవింగ్స్ ఖాతాదారులకు 40 నుంచి ఒకటన్నర లక్ష వరకు ఏటీఎంల నుంచి విత్‌ డ్రా చేసుకునే అవకాశం కల్పించినప్పటికీ త్వరలోనే అన్ని బ్యాంకులూ విత్ డ్రా మొత్తాన్ని రూ. 10 వేలకే కుదించే ప్రమాదం కనబడుతోంది. అంటే ఏప్రిల్ 1 నుంచి ఖాతాదారులు ఎవరైనా రోజుకు పది వేలు మాత్రమే ఏటీఎంల నుంచి తీసుకునే వెసలుబాటు కల్పించనున్నారు. ‘నోట్ల రద్దు’సమయంలో అన్ని బ్యాంకుల ఖాతాదారులకు ఏటీఎంల ద్వారా నగదు విత్‌డ్రాకు ఎక్కువగా తోడ్పడిన ఎస్‌బీఐ ఏటీఎంలు ఇప్పుడు అసలు పనిచేయకపోవడానికి ఇదే కారణం. కొన్ని ఏటీఎంలలో మాత్రమే పరిమితంగా నగదు నింపుతున్నారు. 
 
ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లుగా ఏటీఎంలలో నగదు కొరత, బ్యాంకు శాఖల్లో ఉచిత లావాదేవీలపై పరిమితి నేపథ్యంలో తమ వద్ద ఉన్న నగదు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసేందుకు ఖాతాదారులు వెనుకడుగు వేస్తున్నారు. దీంట్లో బ్యాంకుల్లో డిపాజిట్లు కూడా నిండుకున్నాయి. వచ్చే ఆరు నెలలపాటు పరిస్థితి మరింతి దారుణంగా తయారవుతుందని బ్యాంక్ అధికారులే గుంభనంగా చెబుతుండటం గమనార్హం.
 
జరుగుతన్న పరిణామాలను చూస్తుంటే ఒక్క మాటలో చెప్పాలంటే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.