శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 2 మార్చి 2015 (14:48 IST)

పులిని పెంచుకుంటా.. అనుమతివ్వండి : మధ్యప్రదేశ్ మహిళా మంత్రి!

సాధారణంగా మనుషులు తమకు ఇష్టమైన కుక్కలు, పిల్లులు, పక్షులు వంటివి పెంచుకుంటారు. కానీ, మధ్యప్రదేశ్ రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా ఉంటున్న ఓ మహిళా ప్రజాప్రతినిధికి ఓ వింత ఆలోచన వచ్చింది. అదేంటంటే.. పులిని పెంచుకోవాలన్న ఆశ. అంతే.. ఆమె ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా అటవీశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. 
 
ఆ మహిళా మంత్రి పేరు కుసుమ్ మెహ్‌దెలే. థాయ్‌లాండ్ వాసుల తరహాలోనే తానూ ఓ పులిని పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆమె దరఖాస్తు చేసుకున్నారు. అయితే కేంద్రం నుంచి స్పందన రాలేదట. గతేడాది సెప్టెంబరు నెలలో కుసుమ్ రాసిన లేఖను తాజాగా భోపాల్‌కు చెందిన సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు అజయ్ దూబే వెలికితీశారు. 
 
పులులను పెంచుకునే వెసులుబాటు ఉన్న కారణంగా థాయ్‌లాండ్ వంటి దేశాల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్న కుసుమ్, మన దేశంలో ఆ తరహా సౌకర్యం లేని కారణంగానే నానాటికీ పులుల సంఖ్య తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
దేశంలో పులుల సంఖ్య తగ్గిపోతోందన్న భావనతోనే కుసుమ్, కేంద్రం చర్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఈ లేఖ రాశారట. ఇదిలావుంటే, ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న పన్నా నియోజకవర్గంలోని అభయారణ్యంలో పులుల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిందని అజయ్ దూబే చెబుతున్నారు.