శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 27 మే 2015 (11:17 IST)

ఎంపీలాడ్స్ నుంచి చిల్లిగవ్వ వాడని సోనియా - రాజ్‌నాథ్ సింగ్.. ఇంకా....

నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం కేంద్రం కేటాయించే ‘ఎంపీల్యాడ్స్‌ నిధుల్లో 55 శాతం ఎంపీలు చిల్లిగవ్వ కూడా వాడలేదు. ఇలాంటి వారిలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు.. పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఉన్నారు. 
 
సాధారంగా 'ఎంపీల్యాడ్స్ నిధులను విరివిగా ఉపయోగించండి. స్వచ్ఛ భారత్‌ పథకంలో భాగంగా.. గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్లు కట్టించండి’ ఇది నరేంద్ర మోడీ దేశ ఎంపీలకు ఇచ్చిన పిలుపు. కానీ మన ఎంపీలు పూర్తిగా విస్మరించారు. ఎంపీల సంగతి సరే.. చాలా మంది కేంద్ర మంత్రులూ ఎంపీల్యాడ్స్‌ నిధుల నుంచి ఒక్క రూపాయీ వాడలేదు. 
 
కేంద్ర గణాంక, పథకాల అమలు మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం 55 శాతం మంది ఎంపీలు తమకు కేటాయించిన నిధుల నుంచి ఒక్కపైసా వినియోగించలేదని తేలింది. ఇందులో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అనంతకుమార్‌, సదానంద గౌడ, కల్రాజ్‌ మిశ్రా, ఉమాభారతితో పాటు.. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా, ములాయం సింగ్‌ యాదవ్‌ వంటి సీనియర్‌ పార్లమెంటేరియన్లు సైతం ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. 
 
గణాంక శాఖ లెక్కల ప్రకారం.. పెద్ద రాష్ట్రాల్లో ఎంపీలే ఎక్కువగా ఎంపీల్యాడ్స్‌ను విస్మరిస్తున్నారని తెలిసింది. ఈ ఏడాదిలో తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల ఎంపీలే తమ నిధుల్లో దాదాపు 35 శాతం ప్రజాకార్యక్రమాల కోసం ఖర్చు చేశారు. హర్యానా బీజేపీ ఎంపీ ధరంబీర్‌ సింగ్‌ ఒక్కరే అత్యధికంగా 98 శాతం నిధులను వినియోగించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ప్రధాని మోడీ నియోజకవర్గం వారణాసిలో 16 శాతం నిధులను వినియోగించారు.