మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2017 (15:06 IST)

మా కుటుంబమంతా శివ భక్తులమే : రాహుల్ గాంధీ

గుజరాత్ రాష్ట్రంలోని సోమ్‌నాథ్ ఆలయ సందర్శనపై తలెత్తిన వివాదంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు. తమ కుటుంబమంతా శివభక్తులమేనంటూ వ్యాఖ్యానించారు.

గుజరాత్ రాష్ట్రంలోని సోమ్‌నాథ్ ఆలయ సందర్శనపై తలెత్తిన వివాదంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు. తమ కుటుంబమంతా శివభక్తులమేనంటూ వ్యాఖ్యానించారు. పైగా, మతాచారాలపై రాజకీయాలు చేయొద్దని ఆయన హితవు పలికారు. 
 
గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్‌.. గత బుధవారం సోమ్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించిన విషయం తెలిసిందే. రాహుల్‌ పేరు హిందూయేతరులకు ఉద్దేశించిన రిజిస్టరులో నమోదు కావడంతో ఇది కాస్తా వివాదాస్పదంగా మారింది. ఆయన హిందువు కాదంటూ బీజేపీ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. 
 
ఈ వివాదంపై ఆయన స్పందిస్తూ, ‘మా నానమ్మ(దివంగత ప్రధాని ఇందిరా గాంధీ), మా కుటుంబం మొత్తం శివ భక్తులం. అయితే ఇలాంటి విషయాలను మేం బయటకు చెప్పుకోం. ఎందుకంటే అది వ్యక్తిగత అభిప్రాయమని మేం భావిస్తాం. వీటిని ఎవరూ ధ్రువీకరించాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. పైగా, ఇలాంటి అంశాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. 
 
'ఆ రోజు ఏం జరిగిందో నేను చెబుతాను. ముందు నేను ఆలయంలోకి వెళ్లి పర్యాటకుల పుస్తకంలో సంతకం చేశాను. ఆ తర్వాత భాజపాకు చెందిన వ్యక్తులు నా పేరును రెండో పుస్తకంలో రాశారు' అని రాహుల్‌ ఆరోపించారు.