శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శనివారం, 25 మార్చి 2017 (02:23 IST)

సింహం సింగిల్‌గానే వస్తుంది. గేదె మాంసమే తింటుంది. కోడి మాంసం పెడతారా.. ఆయ్!

పాలకులు మతపర కారణాలతో, విశ్వాసాల ప్రాతిపదికన తీసుకునే చర్యలు మనుషులను ఇబ్బందిపడతాయి కానీ జంతువులను మహా మహాగా ఇబ్బంది పెడతాయని యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం గ్రహించటంలేదు. అందుకే ఉత్తరప్రదేశ్‌లో కొత్త ప్రభ

పాలకులు మతపర కారణాలతో, విశ్వాసాల ప్రాతిపదికన తీసుకునే చర్యలు మనుషులను ఇబ్బందిపడతాయి కానీ జంతువులను మహా మహాగా ఇబ్బంది పెడతాయని యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం గ్రహించటంలేదు. అందుకే ఉత్తరప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం దెబ్బకు కబేళాలు మూతపడటంతో అక్కడి జూలలోని మాంసాహార భక్షణ జంతువులు అన్నమో రామచంద్రా అని కాదు.. గేదెమాంసమో ఆదిత్యనాథా.. అని గర్జిస్తున్నాయట.
 
విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ ఆదేశాల  ప్రకారం చట్ట విరుద్దమైన కబేళాలు మూతపడటంతో కాన్పూర్‌లోని జూలో పలు జంతువులకు చిక్కు వచ్చిపడింది. నిన్నమొన్నటి దాకా అవి గేదెమాంసాన్ని ఆరగించేవి. కాన్పూర్‌లో కబేళాల మూసివేత ఫలితంగా గేదె, దున్నపోతు మాంసం దొరక్కపోవడంతో జూ అధికారులు మేక, కోడి మాంసాన్ని వడ్డిస్తున్నారు. 
 
అయితే గేదెమాంసాన్ని ఇన్నేళ్లుగా రుచిమరిగిన కోడి, మేక మాంసాలను జూలోని క్రూరమృగాలు ఏమాత్రం ఇష్టపడటం లేదని సమాచారం. బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీలో భాగంగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రాష్ట్రంలోని అక్రమ, అనుమతుల్లేని కబేళాలను మూసివేయాల్సిందిగా కొన్నాళ్ల క్రితం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ మాంసానికి కొరత ఏర్పడింది.
 
కాన్పూర్‌ జూలో మగ సింహం అజయ్, ఆడసింహం నందినితోపాటు మాంసాహారం తినే జంతువులు 70 ఉన్నాయి. మగ మాంసాహార జంతువులు రోజుకి 12 కేజీల మాంసాన్ని, ఆడ జంతువులు 10 కేజీల మాంసాన్ని తింటాయి. రోజు 150 కేజీల దున్నపోతు మాంసాన్ని జూ కొనుగోలు చేస్తుంది. జూలోని కొన్ని జంతువులకు కోడి మాంసాన్ని ఆహారంగా పెడితే తినేందుకు ఆసక్తి చూపడం లేదని, కొన్ని అయితే దానిని ముట్టుకోవడమే లేదని అధికారులు చెబుతున్నారు.
 
యోగిగా, బ్రహ్మచారిగా, నిష్మాక కర్మలు పాటించే ఆదిత్యనాధ్ తనకు ప్రజల్లో ఉన్న గుడ్ విల్‌ను, నమ్మకాన్ని ఇలాంటి చర్యల ద్వారా పోగొట్టుకోవద్దని చాలామంది కోరుకుంటున్నారు. ప్రజల ఆహార అలవాట్లపై నియంత్రణ పెడితే జనం భయంతోనో, మరే కారణం చేతో తమ అలవాట్లను తాత్కాలికంగా ఆపుకోవచ్చు కానీ అలా చేయడానికి సింహాలు మనుషులు కాదు కదా. 
 
అందుకే వాటికి ఎంత ధిక్కారముందంటే గేదెమాంసం, దున్న మాంసం, బర్రె మాంసం పెట్టకుండా ఆఫ్టరాల్ కోడి, మేక మాంసం పెడతారా.. సింహం ముందా మీ కుప్పిగంతులు అంటూ అవి ఈ కొత్త మాంసం వాసన కూడా చూడలేదట. మనుషులను అంటే తిట్టో, కొట్టో భయపెడతారు. మరి సింహాలనూ భయపెడతారా 
 
యోగీ ఆదిత్యనాధ్ జీ.. 
అధికారంలోకి వచ్చి వారం రోజులు కూడా కాలేదు. కొన్ని విషయాల్లో రాంగ్ ట్రాక్‌లో వెళుతున్నారేమో ఆలోచించండి మరి. ప్రజాభిప్రాయం, ప్రజా తీర్పు పాదరసం లాంటివి. అవి ఎల్లకాలం మీ పక్షానే ఉండవు. మీరేం చేసినా అవి సహిస్తూ ఉండవు. అనాలోచితంగా మీరు తీసుకున్న చర్యకు జంతువులే తిరగబడుతున్నాయి. ఇక మనుషుల మాటేమిటి?