శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (15:39 IST)

జయలలితను విషమ పరిస్థితుల్లో హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు.. మరణం వెనుక కుట్రలేదు : రిచర్డ్ బాలే

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలితను అత్యంత విషమ పరిస్థితుల్లో ఆస్పత్రిలో అడ్మిట్ చేశారనీ, అయినప్పటికీ ఆమెన బతికించేందుకు విశ్వప్రయత్నం చేసినట్టు ఆమెకు చికిత్స అందించిన లండన్ ప్రత్యేక వైద్య నిపుణుడు డ

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలితను అత్యంత విషమ పరిస్థితుల్లో ఆస్పత్రిలో అడ్మిట్ చేశారనీ, అయినప్పటికీ ఆమెన బతికించేందుకు విశ్వప్రయత్నం చేసినట్టు ఆమెకు చికిత్స అందించిన లండన్ ప్రత్యేక వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ బాలే వెల్లడించారు. జయలలిత మరణంపై ఉన్న అనుమానాలను చెన్నై అపోలో ఆస్పత్రికి చెందిన వైద్యులతో కలిసి రిచర్డ్ బాలే నివృత్తి చేశారు. ఇందుకోసం ఆయన సోమవారం చెన్నైలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంలో ఎలాంటి కుట్ర జరగలేదని స్పష్టం చేశారు. జయలలితకు చక్కెర వ్యాధి తీవ్ర స్థాయిలో పెరిగిపోయిందన్నారు. ఆమెను ఆస్పత్రిలో చేర్చే సమయానికి చక్కెర లెవల్స్ బాగా పెరిగిపోయిన ఉన్నాయన్నారు. అలాగే, ఇన్ఫెక్షన్ వల్ల ఆమె శరీరంలోని అవయవాలు చాలా మేరకు పాడైపోయాయని వివరించారు. అలాగే, జయలలితకు కాళ్లు తొలగించినట్టు వచ్చిన వార్తలు ఏమాత్రం నిజం లేదన్నారు. 
 
‘‘శ్వాస సంబంధమైన ఇబ్బందులతో జయలలిత అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆమె రక్తంలో ఇన్‌ఫెక్షన్ ఉంది. రక్తంలో చెడు బ్యాక్టీరియా (సెప్సిస్) ఉన్నట్టు గుర్తించాం. శ్వాస సంబంధమై ఇబ్బందులు ఆమె శరీర అవయవాలు దెబ్బతినేందుకు కారణమయ్యాయి. బీపీ సమస్య కూడా తీవ్రంగా ఉండడంతో పరిస్థితి మరింత జఠిలమైంది. రక్తంలో వ్యాధికారక క్రిములతో పాటు... నియంత్రణ కానీ సుగర్ లెవెల్స్, మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్, రక్తపోటు, డీహైడ్రేషన్ సమస్యలతో జయలలితను బాధించాయి. ఆమె ఆస్పత్రికి వచ్చినప్పుడు స్పృహలోనే ఉన్నారు. చికిత్సకు చక్కగా స్పందించారు‘‘ అని పేర్కొన్నారు. 
 
ఆమెను ఆస్పత్రికి తీసుకురాగానే... ముందుగా ఆమె ఆరోగ్యాన్ని పరిస్థితిని స్థిరంగా ఉంచే ప్రయత్నం జరిగిందన్నారు. మగతగా ఉన్నప్పటికీ వారం రోజుల పాటు అధికారులతో మాట్లాడుతూ పాలనా కార్యక్రమాలు చూసుకున్నారన్నారు. అందరితో బాగానే మాట్లాడారనీ.. ఆహారం కూడా స్వయంగా తీసుకున్నారని వెల్లడించారు. వైద్యం తీసుకుంటున్న సమయంలో కొన్ని అడుగులు మాత్రమే నడవగలిగే వారని వెల్లడించారు. కోలుకుంటున్నారనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడం జరిగిందన్నారు. అదేసమయంలో తాము వైద్యులమని, రాజకీయ సంబంధమైన, విధానపరమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేమని ఓ ప్రశ్నకు వారు సమాధానమిచ్చారు.