శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (10:44 IST)

ముఖ్యమంత్రి పీఠాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : సీఎం పన్నీర్‌సెల్వం ధిక్కరణ

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఎన్ని రకాలైన ఎత్తులు పైఎత్తులు వేసినప్పటికీ... ముఖ్యమంత్రి పీఠాన్ని వదిలిపెట్టరాదని సీఎం పన్నీర్ సెల్వం మొండిపట్టుదలతో ఉన్నట్టు సమాచారం. నిజానికి కొద్ది రోజులుగా శశ

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఎన్ని రకాలైన ఎత్తులు పైఎత్తులు వేసినప్పటికీ... ముఖ్యమంత్రి పీఠాన్ని వదిలిపెట్టరాదని సీఎం పన్నీర్ సెల్వం మొండిపట్టుదలతో ఉన్నట్టు సమాచారం. నిజానికి కొద్ది రోజులుగా శశికళతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. శుక్రవారం మెరీనాలో జరిగిన అన్నాదురై వర్ధంతి సమయంలోనూ శశికళ పట్ల అసంతృప్తిగానే వ్యవహరించారు. అన్నాదురైకు అంజలి ఘటించి తన దారిన వెళ్లిపోయారు. అదేసమయంలో పదవి నుంచి తప్పుకునేందుకు పన్నీర్‌ సెల్వం ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. 
 
కేంద్రం మద్దతు, ప్రజాదరణ, అధికారుల సహకారం ఉన్న తాను ఎందుకు తప్పుకోవాలని రెండు రోజుల క్రితం శశికళ మద్దతుదారులను పన్నీర్ సెల్వం నిలదీసినట్లు సమాచారం. అయితే, శశికళ మాత్రం తన పట్టాభిషేకానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఓ.పన్నీర్‌సెల్వం వెనక్కి తగ్గుతారా శశికళే తన మనసు మార్చుకుంటారా? అన్నది తేలాలి. తమిళ ప్రభుత్వాధినేత మార్పిడి జరిగితే త్వరలోనే తమిళ రాజకీయాల్లో పెనుమార్పులు ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 
 
ఇదిలావుండగా, అన్నాడీఎంకే శాసనసభ్యుల అత్యవసర సమావేశం ఆదివారం మధ్యాహ్నం జరుగనుంది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి హోదాలో శశికళ ఆదేశాలు జారీ చేశారు. అన్నాడీఎంకే మీద పూర్తి పట్టు సాధించిన శశికళ ఈ నెలలోనే మంచిరోజు చూసి సీఎం పదవిని చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పార్టీ ఎమ్మెల్యేలు 136 మందిని చెన్నై రమ్మన్నారు. దిగ్ర్భాంతి చెందిన ఎమ్మెల్యేలు శనివారమే నగరానికి చేరుకున్నారు.