శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 23 ఆగస్టు 2014 (08:51 IST)

టీ సర్వేతో కేసీఆర్ ఉద్దేశ్యమేంటి : నరసింహన్ వద్ద మోడీ ఆరా!

ఎంతో వివాదానికి గురైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై ఉమ్మడి గవర్నర్ నరసింహన్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరా తీశారు. ఆ సర్వే వల్లే తెలంగాణ ప్రభుత్వం ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రా ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ సమావేశమయ్యారు. 
 
శుక్రవారం ప్రధాని కార్యాలయానికి వెళ్లిన గవర్నర్‌ అక్కడ దాదాపు గంటన్నరపాటు ఉన్నారు. మోడీతో అర్థగంటపాటు చర్చలు జరిపినట్లు తెలిసింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే గురించి ప్రధాని మోడీ అడిగినట్లు తెలిసింది. సర్వే ఎందుకు చేశారు? దాని ఉద్దేశాలేంటని ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే, కొత్తగా అధికారంలోకి వచ్చిన రెండు రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరు ఎలా ఉంది? అని కూడా అడిగినట్లు తెలిసింది. సమగ్ర కుటుంబ సర్వే, ఇరు రాష్ట్రాల పనితీరుపై వేర్వేరు నివేదికలను మోడీకి గవర్నర్‌ సమర్పించినట్లు తెలిసింది.  
 
అలాగే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను సమన్వయ పరచాలని, వివాదాస్పద అంశాలపై చర్చలే మార్గంగా పరిష్కరించుకునేలా చూడాలని కోరారు. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలకు కారణమవుతున్న విద్యుత్, నీరు, సిబ్బంది పంపిణీ అంశాలను పరస్పరం చర్చల ద్వారా పరిష్కరించుకునేలా చూడాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి గవర్నర్‌కు మార్గదర్శనం చేశారు.
 
ఆయా అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు కలసి కూర్చుని చర్చించుకునేలా చొరవ తీసుకోవాలని నరసింహన్‌కు సూచించారు. ఈ నేపథ్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్ వివాదం సమసిన తీరును, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలసి వివిధ అంశాలపై చర్చించుకున్న తీరును గవర్నర్.. ప్రధానికి వివరించారు. కాగా రాష్ట్ర స్థాయి అధికారులు, సివిల్ సర్వీసెస్ అధికారుల విభజనను త్వరితగతిన పూర్తిచేసేలా చూస్తామని ప్రధానమంత్రి ఆయనతో చెప్పినట్టు సమాచారం.