శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (12:19 IST)

బీజేపీ ఎంపీలకు నరేంద్ర మోడీ గడువు: 48 గంటల్లో ఆస్తులు వెల్లడించాలి!

భారతీయ జనతా పార్టీ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్తుల వెల్లడిపై ఒక డెడ్‌లైన్ విధించారు. వచ్చే 48 గంటల్లో పార్టీకి చెందిన ఎంపీలందరూ తమ ఆస్తుల వివరాలను బహిర్గతం చేయాల్సిందేనంటూ ఆయన ఆదేశించారు. 48 గంటల్లోగా తమ ఆస్తుల చిట్టాను పార్లమెంట్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమయ్యేలా చర్యలు తీసుకోవాలని తన ఆదేశాల్లో మోడీ పేర్కొన్నారు. 
 
ఖాట్మండు వేదికగా జరుగుతున్న సార్క్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోడీ నేపాల్ వెళ్లిన విషయం తెల్సిందే. ఇదే అదనుగా భావించిన విపక్షాలు మంగళవారం నల్లధనం అంశంపై పార్లమెంట్‌లో రభస చేశాయి. ఈ నేపథ్యంలో ఎంపీలందరూ తమ ఆస్తుల చిట్టాలను పార్లమెంట్ సెక్రటేయట్‌కు అందించడమే కాక దగ్గరుండి మరీ సదరు జాబితాలు పార్లమెంట్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమయ్యేలా చూసుకోవాలని ఆయన నేపాల్ నుంచే ఆదేశాలు చేశారు. 
 
నల్లధనంపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఇరుకునపెట్టేందుకు యత్నిస్తున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసేందుకే మోడీ ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం. మోజీ ఆదేశాలతో పార్టీ ఎంపీల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. తమ ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు సిద్ధమవుతున్నారు.