శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 1 అక్టోబరు 2016 (13:50 IST)

నిజంగా నాది 56 అంగుళాల ఛాతినే.. 'నేను సుఖంగా నిద్రపోతా.. పాక్‌కు నిద్రలేకుండా చేస్తా'.. వెంకయ్యతో మోడీ

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తీవ్రవాద శిబిరాలపై భారత్ ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులు విజయవంతమైన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయట. పైగా, తన సంతోషాన్ని కేంద్రమంత్రి వెంకయ్య నా

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తీవ్రవాద శిబిరాలపై భారత్ ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులు విజయవంతమైన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయట. పైగా, తన సంతోషాన్ని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతోనే మొదట పంచుకున్నారట. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా వెంకయ్యను తన నివాసానికి పిలిచి ఆలింగనం చేసుకుని మరీ ఆనందపడ్డారట. 
 
‘‘ఆపరేషన్‌ సక్సెస్‌’’ అంటూ జాతీయ భద్రతా సలహాదారు అజిత దోవల్‌ ఫోన్‌ చేసి చెప్పారు. ఆ వెంటనే మోడీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి మొదట ఫోన్‌ చేసి.. ‘‘వెంటనే రాగలరా?’’ అని అడిగారట. వెంకయ్యకు విషయం అర్థం కాలేదు. ఎందుకు అంత అర్జంటుగా రమ్మన్నారో అనుకుంటూ పీఎం వద్దకు వెళ్లారు. వెంకయ్య తన నివాసంలోకి అడుగుపెట్టగానే మోడీ గుమ్మంలోనే ఆయనకు ఎదురై గట్టిగా కౌగిలించుకున్నారు. గత రెండున్నరేళ్లలో ప్రధాని మోడీని అంత సంతోషంగా చూడని వెంకయ్య ఆశ్చర్యపోయారు. 
 
'వెంకయ్యాజీ.. ఉరీ ఉగ్రదాడి తర్వాత సోషల్‌ నెట్‌వర్క్‌లో నాపై దాడి పెరిగింది. '56 అంగుళాల ఛాతీ అన్నావు.. ఎన్నికల సమయంలో ఏవేవో చెప్పావు. అధికారంలోకి వస్తే పాకిస్థాన్‌ విషయంలో కంటికి కన్ను, పన్నుకు పన్ను అన్నావు. పఠాన్‌కోట్‌లో తీవ్రవాదులు దాడులు జరిపారు. ఉరీలో ఆర్మీ క్యాంప్‌పైనే దాడులు చేశారు. ఏం నిద్రపోతున్నావా మోదీ?' అంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న విమర్శలతో నాకు అసలు నిద్ర పట్టలేదు. 
 
ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. దెబ్బకు దెబ్బ తీశాం’’ అంటూ వెంకయ్యకు మోడీ వివరించారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగిన విధానాన్ని అంతా వెంకయ్యకు వివరించి.. 'ఇప్పుడు నేను సుఖంగా నిద్రపోతా.. పాకిస్థాన్‌కు నిద్రలేకుండా చేస్తా' అన్నారు. వాస్తవానికి... ఎన్నికల ముందు పాకిస్తాన్‌ వైఖరిని తీవ్రంగా ఎండగట్టిన మోదీ.. అధికారం చేపట్టాక పాక్‌కు అనేక సార్లు స్నేహహస్తం అందించారు. ఈ వైఖరిని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ దుయ్యబట్టింది.