శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 29 జులై 2015 (09:30 IST)

కలాం.. శాస్త్రవేత్త మాత్రమే కాదు అద్భుతమైన కవి కూడా : ప్రణబ్ ముఖర్జీ

అకాలమరణం చెందిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతిపట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా కలాంతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. అలాగే, కలాం కేవలం ఒక గొప్ప శాస్త్రవేత్త మాత్రమే కాదనీ, ఆయనలో ఓ అద్భుత కవి కూడా దాగివున్నాడని గుర్తు చేశారు.
 
 
కలాం మరణవార్త తెలియగానే ఆయన తన బెంగుళూరు పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత ప్రొటోకాల్ నిబంధనలు పక్కనబెట్టి.. పాలం విమానాశ్రయానికి వెళ్లి.. అంజలి ఘటించారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘అబ్దుల్‌ కలాంలా దేశ ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న రాష్ట్రపతి మరొకరు లేరు’ అని కొనియాడారు. అందుకే ఆయన నిజమైన ప్రజల రాష్ట్రపతి అని చెప్పారు. 
 
‘రాష్ట్రపతి గా ఉన్న సమయంలో అమర్‌ జవాన్‌ జ్యోతి వద్ద అమరజవాన్లకు నివాళులర్పించే సమయంలో ఆయన కవితలు రాసుకొచ్చేవారు. అవి ఎంతో అద్భుతంగా ఉండేవి’ అని చెప్పారు. కలాంను శక్తివంతమైన మేధస్సు కలిగిన సంపూర్ణ వ్యక్తిగా అభివర్ణించారు. ఆయన స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరన్నారు. ‘రక్షణశాఖ మంత్రికి శాస్త్ర, సాంకేతిక సలహాదారుగా ఉన్న సమయంలో ఆయన్ను నేను తొలిసారి కలిశాను’ అని ప్రణబ్‌ గుర్తు చేసుకున్నారు. కలాం పుస్తక ప్రియుడని, ఆయన వాటిని ఎంతో ప్రేమించేవారని చెప్పారు.