శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (11:21 IST)

పీవీ స్మారక చిహ్నానికి బాబ్రీ మసీదు కూల్చివేతకు లింకు.. అజమ్ ఆరోపణ..!

కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేసిన దివంగత ప్రధాన మంత్రి పీవీ నరసింహరావుకు హస్తినలో స్మారక చిహ్నం ఏర్పాటుకు ఆ పార్టీ వెనుకాడినా, ఎన్డీయే ప్రభుత్వం ముందుకు రావడంతో అందరూ ఆనందిస్తుండగా, తాజాగా ఉత్తర ప్రదేశ్ మంత్రి, సమాజ్ వాది పార్టీ నేత అజమ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 
 
బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో పీవీ పాత్రకు ప్రతిఫలంగానే స్మారక చిహ్నం ఏర్పాటుకు ఎన్డీయే సమ్మతించినట్లు ఆరోపించారు. బాబ్రీ కూల్చివేత విషయంలో ఆరెస్సెస్‌తో మాజీ ప్రధానికి ఉన్న అప్రకటిత అవగాహనకు ప్రతిఫలమని అజం ఖాన్ వ్యాఖ్యానించారు. బాబీ కూల్చివేతతో బీజేపీ నేతలను శిక్షించాలంటూ సీబీఐ కోరటం కుట్రలా కనిపిస్తోందన్నారు.
 
అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతకు ఆరెస్సెస్‌కు లోపాయకారీగా మద్దతిచ్చిన అప్పటి ప్రధాని పీవీ నరసింహా రావును గౌరవించేందుకే ఎన్డీయే సర్కారు ఆయనకు స్మారకస్థలిని నిర్మిస్తోందని ఆజమ్‌ ఖాన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 
 
కాగా, ఢిల్లీలో పీవీ నర్సింహా రావు స్మారక స్థూపం ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు దానికి ఎన్డీయే ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.