శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 29 జులై 2015 (15:05 IST)

రాజీవ్ హత్యకేసులో నిందితులకు ఊరట.. ఉరిశిక్షను రద్దుచేసిన సుప్రీం కోర్టు...

భారత దేశ దివంగత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో నిందితులకు ఊరట లభించింది. ఈ కేసులో నిందితులైన మురుగేశన్, సంతానం, పేరరివాళన్‌లకు విధించిన ఉరిశిక్షను  సుప్రీం కోర్టు రద్దుచేసింది. ఈ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ సంచలనాత్మక తీర్పునిచ్చింది. 1991 మే 21న శ్రీపెరంబదూర్‌లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మానవబాంబు పేలి దుర్మరణం చెందారు.
 
ఆ సమయంలో రాజీవ్‌తో పాటు పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్య కేసులో తనను తాను పేల్చుకున్న మానవబాంబు ధను సంఘటనా స్థలంలోనే చనిపోగా, ప్రధాన నేరస్తులైన శివరాసన్, మరో ఇద్దరు పోలీసు ఎన్ కౌంటర్‌లో చనిపోయారు. ఈ హత్య కేసులో నిందితులైన మురుగేశన్, సంతానం, పేరరివాళన్‌లు 24 సంవత్సరాలుగా జైలులో ఉంటున్నారు. 
 
వారు ముగ్గురికి గతంలో కింది కోర్టు విధించిన ఉరిశిక్షను పైకోర్టు ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. అయితే 25 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని ఇప్పుడు ఉరి తీయడం భావ్యం కాదని, వారు ప్రధాన నిందితులు కానందువల్ల ఉరిశిక్షను రద్దుచేయాలని సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే మాజీ ప్రధాని హంతకులను ఎట్టిపరిస్థితిలోనూ కనికరించరాదని కోరుతూ కేంద్ర ప్రభుత్వం క్యురేటివ్ పిటిషన్ దాఖలుచేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు బుధవారం కొట్టివేసింది.