శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 24 జులై 2014 (09:49 IST)

మహారాష్ట్ర సదన్‌లో రోటీ రచ్చ.. ఇరకాటంలో మోడీ సర్కారు!

ఢిల్లీలోని న్యూ మహారాష్ట్ర సదన్‌లో తమకు సంప్రదాయ వంటలు వడ్డించలేదన్న నెపంతో 11 మంది శివసేన ఎంపీలు ఒక ముస్లిం వ్యక్తికి రోటీ తినిపించి రంజాన్ ఉపవాస దీక్షను భగ్నం చేసిన అంశం పార్లమెంటులో దుమారం రేపింది. మత స్వేచ్ఛను శివసేన ఎంపీలు కాలరాశారని విపక్ష సభ్యులు విరుచుకుపడ్డారు. శివసేన ఎంపీలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
దీంతో సభలో గందరగోళం చెలరేగింది. ఈ రోటీ వివాదం ఓ పెను వివాదంలా మారింది. పార్లమెంటు ఉభయ సభలను ఓ కుదుపు కుదిపింది. బీజేపీ అగ్రనేత ఎల్కే. అద్వానీ సైతం రోటీ వివాదంపై విచారం వ్యక్తం చేశారు. అలా జరిగి వుండాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు ఇరకాటంలో పడినట్టయింది. 
 
దీంతో తేరుకున్న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి వెంకయ్య నాయుడు సభలో వివరణ ఇచ్చారు. రోటీ వ్యవహారాన్ని వివాదం చేయరాదని, ముఖ్యంగా... మత రంగు అంటించరాదని విపక్ష పార్టీలను కోరారు.