శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (18:38 IST)

సీఎం పగ్గాలపై శశికళకు పక్కా వ్యూహం.. ఈసీతో చుక్కెదురు.. వదంతులు నమ్మొద్దన్న దీప

తమిళనాడు సీఎం పగ్గాలు చేపట్టేందుకు ప్రస్తుత ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంను కోశాధికారి పదవి నుంచి తప్పించి.. పార్టీ నుంచి కూడా దూరం చేసిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు కొత్త చిక్కొచ్చిపడింది. అ

తమిళనాడు సీఎం పగ్గాలు చేపట్టేందుకు ప్రస్తుత ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంను కోశాధికారి పదవి నుంచి తప్పించి.. పార్టీ నుంచి కూడా దూరం చేసిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు కొత్త చిక్కొచ్చిపడింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆమె ఎన్నికపై వివరణ ఇవ్వాల్సిందిగా పార్టీని ఎన్నికల సంఘం ఆదేశించింది. శశికళ ఎన్నికను తప్పుబడుతూ ఆ పార్టీకి చెందిన బహిష్కృత ఎంపీ శశికళా పుష్పా ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈమేరకు చర్యలు తీసుకుంది.
 
శశికళ ఎన్నికపై శశికళా పుష్ప ఒక పిటిషన్‌ను ఎన్నికల సంఘానికి సమర్పించారని, దీంతో వివరణ ఇవ్వాల్సిందిగా అన్నాడీఎంకేను కోరామని ఎన్నికల సంఘం డైరెక్టర్‌ ధీరేందర్‌ ఓజా తెలిపారు. గతవారమే ఈ పిటిషన్‌ను అన్నాడీఎంకేకు పంపామని, దీనిపై ఎలాంటి వివరణ అందలేదని ఈసీ వెల్లడించింది. జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే అధినేత్రిగా శశికళ ఎన్నిక నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ ఈసీ పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
ఇదిలా ఉంటే.. తమిళనాడు రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. సీఎం పీఠం కోసం పన్నీర్‌ సెల్వం, శశికళ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుండగా మరో వైపు జయ మేనకోడలు దీపా జయకుమార్‌ రాజకీయరంగ ప్రవేశంపై వూహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో దీపా జయకుమార్‌ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ''ముందుగా చెప్పినట్లు ఈనెల 24న నా నిర్ణయం ప్రకటిస్తా. నేను స్వయంగా ప్రకటించే లోపు వదంతులు నమ్మవద్దు. ఈలోపు రాజకీయ నిర్ణయం ప్రకటించాల్సి వస్తే నేనే స్వయంగా చెబుతా'' అని తెలిపారు.