శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (05:11 IST)

కేడర్‌ను పట్టుకుంటే పార్టీ నాదే.. కోటిన్నరమంది సభ్యులకు పన్నీర్ సెల్వం గాలం

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకానికి వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్న మరుక్షణం పార్టీ సర్వ సభ్య సమావేశానికి పిలుపునిచ్చి అటో ఇటో తేల్చుకునేందుకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వ్యూహరచన చేస్తున్నారు. పార్టీలో సర్వసభ్

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకానికి వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్న మరుక్షణం పార్టీ సర్వ సభ్య సమావేశానికి పిలుపునిచ్చి అటో ఇటో తేల్చుకునేందుకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వ్యూహరచన చేస్తున్నారు. పార్టీలో సర్వసభ్య సమావేశం నిర్ణయం కీలకం కావడంతో, ఆ సభ్యుల్ని తన వైపునకు తిప్పుకోవడం లక్ష్యంగా కసరత్తుల్లో  పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో క్రియా శీలకంగా ఉన్న సర్వసభ్య సభ్యుల మద్దతు కూడగట్టుకునే వ్యూహంతో ముఖ్య నాయకుల్ని రంగంలోకి దించారు. 
 
పార్టీలో క్రియాశీలకంగా ఉన్న సర్వసభ్య సభ్యుల్ని తన వైపునకు తిప్పుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం వ్యూహ రచనలో పడ్డారు. ఎన్నికల యంత్రాంగం వెలువరించే నిర్ణయం మేరకు తన కార్యాచరణ వేగవంతం చేయడానికి వ్యూహరచన చేశారు. సర్వసభ్య సమావేశానికి పిలుపునిచ్చి, అన్నాడీఎంకేను, రెండాకుల చిహ్నం కైవసం లక్ష్యంగా పావులు కదిపేందుకు నిర్ణయించారు.
 
దివంగత ఎంజీఆర్‌ చేతుల మీదుగా ఆవిర్భవించి, అమ్మ జయలలిత శ్రమకు తగ్గ ఫలితంగా దేశంలోనే మూడో అతి పెద్ద పార్టీగా అన్నాడీఎంకే అవతరంచింది. అయితే, ఆ అమ్మ మరణంతో చోటు చేసుకున్న పరిణామాలకు అన్నాడీఎంకే మూడు ముక్కలు కావాల్సిన పరిస్థితి. కోటిన్నర మంది సభ్యులు తలా ఓ దిక్కు అన్నట్టు చెల్లాచెదరు అయ్యే ప్రమాదం ఏర్పడింది. జయలలిత మేన కోడలు దీపా బాటలో కొందరు, పన్నీరు బాటలో మరికొందరు, మిగిలిన వారు చిన్నమ్మ శశికళ నేతృత్వంలోని శిబిరం గొడుగు నీడలో చేరారు. మెజారిటీ శాతం మంది ఎమ్మెల్యేలు చిన్నమ్మ శిబిరం వైపు నిలబడడంతో అధికారాన్ని దూరం చేసుకున్న పన్నీరుసెల్వం, కేడర్‌ సాయంతో అన్నాడీఎంకేను గుప్పెట్లోకి తీసుకునే వ్యూహం రచించారు.
 
ఈసీ నిర్ణయంతో  అన్నాడీఎంకే నియమ నిబంధనలకు విరుద్ధంగా శశికళను ప్రధాన కార్యదర్శిగా నియమించినట్టు ఇప్పటికే పన్నీరు శిబిరం కేంద్రం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై ఈసీ విచారణ చేపట్టింది. వివరణ కోరుతూ ఈనెల 28 వరకు శశికళకు గడువు ఇచ్చారు. ఆమె ఇచ్చే వివరణను ఈసీ ఏకీభవించని పక్షంలో, ఆమె ప్రధాన కార్యదర్శి నియామకం రద్దు అవుతుంది.
 
దీంతో సర్వసభ్య సభ్యులు మద్దతుతో సమావేశానికి పిలుపునిచ్చే వ్యూహంతో పన్నీరు అడుగులు సాగనున్నాయి. ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయం మేరకు తానే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టడం, రెండాకుల చిహ్నం కైవసం తదుపరి, ప్రభుత్వం మీద దృష్టి పెట్టేందుకు తగ్గ కార్యచరణతో పన్నీరు ముందుకు సాగేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. 
 
న్యాయం కోరుతూ పార్టీ పరంగా తనకు జరిగిన అన్యాయానికి న్యాయం కోరుతూ కేడర్‌లోకి వెళ్తానని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల తేదీ ప్రకటనతో రాష్ట్ర పర్యటన సాగుతుందన్నారు. దీపా కొత్త పేరవై ఏర్పాటు చేయడం ఆహ్వానించ తగ్గ విషయమేనని, ఆమెకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. తన గురించి పరోక్షంగా సినీ నటుడు కమల్‌ వ్యాఖ్యలు చేయడం ఆనందంగా ఉందంటూ,  ఆయన అంటే ఎంతో గౌరవం ఉందన్నారు. ఆయన అన్నట్టుగా ఎన్నికలు వస్తే ఆహ్వానిస్తానని స్పందించారు. అన్నాడీఎంకే తమదేనని ధీమా వ్యక్తం చేశారు.