శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (10:25 IST)

సహనానికీ ఓ హద్దుందన్న శశికళ.. చెన్నైలో హై అలెర్ట్.. అసాంఘిక శక్తులు చొరబాటు..?

చెన్నై నగరంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. నగరంలోని హోటళ్లు, పెద్దపెద్ద భవంతులు, కల్యాణ మండపాలలో శనివారం పోలీసుల పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. హోటళ్లలో బస చేస్తున్న వారి వివరాలను సేకరించారు

చెన్నై నగరంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. నగరంలోని హోటళ్లు, పెద్దపెద్ద భవంతులు, కల్యాణ మండపాలలో శనివారం పోలీసుల పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. హోటళ్లలో బస చేస్తున్న వారి వివరాలను సేకరించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అసాంఘిక చర్యలకు పాల్పడే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వడంతో నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలోకి దాదాపు వెయ్యి మంది వరకూ అసాంఘిక శక్తులు చొరబడ్డాయని ప్రచారం జరిగింది.
 
ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ మద్దతుదారులు ఘర్షణలకు పాల్పడుతుండటంతో శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించాలని అన్ని జిల్లాల పోలీసు యంత్రాంగాలను డీజీపీ రాజేంద్రన్‌ ఆదేశించారు. జల్లికట్టు ఉద్యమంలో చివరిరోజు చోటుచేసుకున్న అల్లర్ల  తరహాలో కుట్రకు అవకాశాలున్నాయని తేలడంతో పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు.   
 
శనివారం 'ఓ సహనానికీ హద్దుంది' అంటూ శశికళ చేసిన వ్యాఖ్యలతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ కమిషనరు జార్జి ఆదేశాల మేరకు పోలీసులు నగరంలోని బ్రాడ్‌వే, ప్యారీస్‌ కార్నర్‌, ట్రిప్లికేన్‌, రాయపేట, వడపళని తదితర నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ తనిఖీలు చేపట్టారు.