శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 27 ఆగస్టు 2014 (12:01 IST)

క్రిమినల్ మంత్రుల తొలగింపులో ప్రధానిదే అంతిమ నిర్ణయం : సుప్రీంకోర్టు

నేరచరిత్ర, క్రిమినల్ కేసుల విచారణ ఎదుర్కొంటున్న వారికి మంత్రివర్గం నుంచి తప్పించాలా వద్దా అనే విషయంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల వివేకానికే వదిలిపెడుతున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదేసమయంలో క్రిమినల్ కేసులున్న మంత్రులను అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్‌ను అపెక్స్ కోర్టు కొట్టివేసింది. అలాగే, వారిపై అనర్హత వేటు వేసేందుకు కూడా నిరాకరించింది. 
 
అయితే, ఈ అంశంపై నిర్ణయాన్ని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల వివేకానికే వదిలిపెడుతున్నట్లు ఐదుగురు జడ్జిల నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. నేరచరిత ఉన్న వారిని, విచారణ ఎదుర్కొంటున్న వారిని ప్రధానమంత్రి, సీఎంలు మంత్రివర్గంలో చేర్చుకోవద్దని కోర్టు సూచించింది. అలాంటి వారిని మంత్రులుగా విధుల నిర్వహణకు అనుమతించరాదని చెప్పింది. అవినీతి, నేరాభియోగాలు ఉన్నవారు మంత్రులుగా బాధ్యతలు నిర్వహించడం సరికాదన్న సుప్రీంకోర్టు.. ప్రధాని, సీఎంలపై రాజ్యాంగపరంగా గురుతర బాధ్యతలున్నాయని ఉద్బోధించింది. 
 
నేర చరిత్ర ఉన్నా, పార్లమెంట్‌లో అడుగిడి మంత్రి పదవులు అనుభవిస్తున్న మన నేతలను ఆ పదవుల్లో కొనసాగించవచ్చా, లేదా అనే విషయంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం విచారణ జరిపి పైవిధంగా తీర్పునిచ్చింది. ఇపుడు సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వెల్లడించిన తర్వాత ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఉన్న 14 మంది నేర చరిత నేతలను మోడీ మంత్రి పదవుల్లో కొనసాగిస్తారా, లేదా అన్న విషయం ప్రాధాన్యం సంతరించుకుంది.