శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 12 జనవరి 2019 (13:05 IST)

కొడనాడు హత్యలు.. ఎడప్పాడి హస్తం.. నిందితుడు సయాన్

దివంగత సీఎం జయలలిత కొడనాడు ఎస్టేట్‌లో జరిగిన అనుమానాస్పద మృతుల కేసులో నిందితుడైన సయాన్.. తెహల్కా మాజీ ఎడిటర్ మాథ్యూ శామ్యూల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశాడు. తెహల్కా విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం తమిళనాట సంచలనం సృష్టిస్తోంది.


ఈ హత్యల మిస్టరీ వెనక సీఎం పళనిస్వామి హస్తం వుందని సయాన్ ఆరోపించాడు. ఎస్టేట్‌లో జరిగిన దోపిడీలో వాచ్‌మన్ మృతి చెందగా, ఈ కేసులో అరెస్ట్ అయిన జయలలిత మాజీ కారు డ్రైవర్ కనకరాజ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 
 
ఇక, మరో నిందితుడైన సయాన్ కేరళలో తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా జరిగిన ప్రమాదం నుంచి బయటపడినా, ఆయన భార్య విష్ణుప్రియ, కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. కొడనాడు ఎస్టేట్‌లో సీసీటీవీ కెమెరాలను పరిశీలించే యువకుడు ఒకరు ఉరేసుకుని మరణించాడు.
 
ఈ మొత్తం మృతుల వెనుక తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి ప్రమేయం ఉందని ఇంటర్వ్యూలో సయాన్ ఆరోపించాడు. ఈ వీడియో వ్యవహారంపై తమిళ మంత్రి జయకుమార్ స్పందించారు. నిందితుడిని ఇంటర్వ్యూ చేసిన మాథ్యూ శామ్యూల్‌‌పై కేసు వేయనున్నట్టు తెలిపారు.
 
అయితే ఎడప్పాడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సయాన్ వ్యాఖ్యలపై ఎడప్పాడి వివరణ ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. అమ్మ పాలన అమ్మ పాలన అని చెప్పుకుంటున్న ఎడప్పాడి.. అమ్మ మృతికి కారణమయ్యారా లేదా అనేది కూడా చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.