శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (17:13 IST)

పళని స్వామి సర్కారు కూలిపోవడం ఖాయం.. ఎన్నికలు తథ్యం : స్టాలిన్ జోస్యం

తమిళనాడులో ముఖ్యమంత్రి పళనిస్వామి సర్కారు కూలిపోవడం ఖాయమని, ఆ తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం తథ్యమని ఎంకే స్టాలిన్ జోస్యం చెప్పారు. తమిళనాడులో పళనిస్వామి ప్రభుత్వం ఎన్నో రోజుల పాటు అధికారంల

తమిళనాడులో ముఖ్యమంత్రి పళనిస్వామి సర్కారు కూలిపోవడం ఖాయమని, ఆ తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం తథ్యమని ఎంకే స్టాలిన్ జోస్యం చెప్పారు. తమిళనాడులో పళనిస్వామి ప్రభుత్వం ఎన్నో రోజుల పాటు అధికారంలో ఉండబోదని, త్వరలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. 
 
పళని ప్రభుత్వానికి అప్పుడే పోయేకాలం దాపురించిందని విమర్శించిన ఆయన, నిన్న అసెంబ్లీలో జరిగిన అల్లర్లపై రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. ఆయన ఆదివారం డీఎంకే ఎమ్మెల్యేలతో సమావేశమై అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై ఆయన చర్చించారు. ఆపై మీడియాతో పై విధంగా మాట్లాడారు. అలాగే, 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తం నిరాహారదీక్షలకు డీఎంకే పిలుపునిచ్చింది. 
 
ఇదిలావుండగా, తమ నేత స్టాలిన్‌పై అసెంబ్లీలో దాడి జరగడం, ఇందులో ఆయన చొక్కా చిరిగిపోవడాన్ని చూసి తట్టుకోలేని డీఎంకే శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగడంతో, తమిళనాడు అట్టుడుకిపోయింది. చెన్నైతో పాటు ఈరోడ్, తిరుచ్చి, కోయంబత్తూరు, నామక్కల్, తిరునల్వేలి తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున డీఎంకే కార్యకర్తలు రహదారుల దిగ్బంధానికి దిగడంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. భారీఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. సున్నిత ప్రాంతాల్లో భద్రతను పెంచారు.
 
కాగా, శనివారం మెరీనా బీచ్‌లో ధర్నాకు దిగి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేందుకు కారణమైనారన్న అభియోగాలతో స్టాలిన్‌తో పాటు.. డీఎంకే ఎమ్మెల్యేలపై కేసు పెట్టిన పోలీసులు ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు. శనివారం సముద్ర తీరానికి భారీగా డీఎంకే కార్యకర్తలు రావడంతో స్టాలిన్‌కు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించి వేసిన పోలీసులు నేడు కేసు పెట్టినట్టు వెల్లడించడం గమనార్హం.