శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 16 డిశెంబరు 2014 (18:40 IST)

తీవ్రవాదులూ... పిల్లల్ని వదిలివేసి.. నన్ను చంపండి : కైలాశ్ సత్యర్థి!

పెషావర్‌లోని సైనిక పాఠశాలపై ఉగ్రవాదుల దాడిని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి తీవ్రంగా ఖండించారు. పిల్లలపై ఉగ్రవాదుల చర్య మానవత్వానికి మాయని మచ్చ అని అభిప్రాయపడ్డారు. పిల్లలను వదిలిపెట్టండి.. అవసరమైతే తనను చంపండి అని సత్యార్థి తీవ్రవాదులకు విజ్ఞప్తి చేశారు. ఈ దాడి ఘటనపై ఆయన స్పందిస్తూ.. తీవ్రవాదుల దాడిని అమానుషంగా ఉందన్నారు. 
 
మరోవైపు.. ఈ దాడికి సంబంధించి పాక్ కేంద్రంగా పని చేసే తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ తీవ్రవాదులు ఒక ప్రకటన విడుదల చేశారు. దాడికి పాల్పడింది తామేనని చెప్పారు. తీవ్రవాదుల కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ సైనికులు వేధింపులకు పాల్పడుతున్నారని, తాము, తమ కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న బాధ సైనికులకు తెలియజెప్పాలనే ఈ దాడికి తెగబడినట్టు ప్రకటించారు. 
 
ఇదే అంశంపై టీటీపీ అధికార ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. పాకిస్థాన్ సైనికులు తమ కుటుంబాలను లక్ష్యాలుగా చేసుకుని వేధిస్తున్నారని, అన్యాయంగా ఎంతో మందిని బలి తీసుకున్నారని ఆరోపించారు. తమ ఆప్తులను కోల్పోతే, ఆ బాధ ఎలా ఉంటుందో సైనికులకు తెలియాలనే వారి బిడ్డలు చదువుతున్న పాఠశాలపై దాడి చేశామని తాలిబాన్లు స్పష్టం చేశారు. 
 
అయితే, పెషావర్ నగరంలోని ఆర్మీ స్కూల్లో చిన్న పిల్లలను వదిలివేయాలని అక్కడి సాయుధులైన తాలిబాన్లకు చెప్పినట్టు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ టీటీపీ ప్రకటించింది. ఆర్మీ స్కూల్లో 23 మంది విద్యార్థులను, ఒక మహిళా ఉపాధ్యాయురాలిని హతమార్చింది తమ వారేనని తెలిపింది. ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో పాకిస్థాన్ సైనిక చర్యకు ప్రతీకారంగానే ఈ దాడి చేశామని టీటీపీ నేత ఒకరు తెలిపారు.