శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (02:47 IST)

అప్పుడు ఎంజీఆర్ ఇప్పుడు జయలలిత మృతి : అసెంబ్లీలో అదే డ్రామా!

తమిళనాట ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు సరిగ్గా మూడు దశాబ్బాల క్రితం జరిగిన పరిణామాలకు అనుకరణ మాత్రమే. సరిగ్గా ముప్పై ఏళ్ల కిందట అన్నా డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎం.జీ.ఆర్ చనిపోయినపుడు.. పార్టీలో, ప్రభుత్వంలో ఆధిపత్యం కోసం ఇద్దరి మధ్య పోరాటం జరి

తమిళనాట ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు సరిగ్గా మూడు దశాబ్బాల క్రితం జరిగిన పరిణామాలకు అనుకరణ మాత్రమే.  సరిగ్గా ముప్పై ఏళ్ల కిందట అన్నా డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎం.జీ.ఆర్ చనిపోయినపుడు.. పార్టీలో, ప్రభుత్వంలో ఆధిపత్యం కోసం ఇద్దరి మధ్య పోరాటం జరిగింది. ఎంజీఆర్ భార్య జానకి, ఆయన రాజకీయ శిష్యురాలు జయలలితల మధ్య ఉత్కంఠ భరిత హైడ్రామా సాగింది. నాడు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు జానకి, జయలలితల వెనుక రెండుగా చీలిపోయారు. అయితే జానకి వైపే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటిలాగానే ఇరు వర్గాలూ ఎమ్మెల్యేల శిబిరాలు నిర్వహించాయి. ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతున్న జానకిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్ సభలో బలాన్ని నిరూపించుకోవాలని నిర్దేశించారు.
 
ఆ విశ్వాసపరీక్ష సందర్భంగా సభలో హింస చెలరేగింది. రెండు వర్గాల ఎమ్మెల్యేలు ఘర్షణ పడ్డారు. స్పీకర్ పోలీసులను పిలిపించి మరీ సభలో లాఠీచార్జి చేయించిన పరిస్థితి. చివరికి జయ వర్గం ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసి విశ్వాసపరీక్ష నిర్వహించారు. నాడు కూడా ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే ఓటింగ్లో పాల్గొనలేదు. ఆ విశ్వాస పరీక్షలో జానకి గెలుపొందినట్లు ప్రకటించారు. 
 
కానీ.. గవర్నర్ ఆ విశ్వాస పరీక్ష చెల్లదని ప్రకటించారు. కేంద్రం జోక్యంతో జానకి ప్రభుత్వం రద్దయింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జానకి రాజకీయాల నుంచి తప్పుకుని అన్నా డీఎంకే రెండు వర్గాలూ ఏకమవడం, కేంద్రం డీఎంకే సర్కారును రద్దు చేయటం, రాజీవ్గాంధీ హత్యానంతర ఎన్నికల్లో జయ నేతృత్వంలోని అన్నా డీఎంకే గెలుపొందటం చరిత్ర.
 
సరిగ్గా 30 ఏళ్ల తర్వాత అదే డిసెంబర్ నెలలో జయలలిత చనిపోయారు. ఇప్పుడు కూడా.. అన్నా డీఎంకేలో మళ్లీ అదే చరిత్ర పునరావృతమయింది. జయలలిత నెచ్చెలి శశికళకు, అమ్మ నమ్మినబంటు పన్నీర్సెల్వంకు మధ్య అధికారం కోసం పోరాటం సాగుతోంది. నాడు ఎంజీఆర్ తెరచాటున ఉన్న జానకి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. నేడు జయలలిత స్నేహితురాలిగా తెరవెనుక ఉన్న శశికళ తెరపైకి వచ్చే ప్రయత్నం చేశారు. 
 
నాడు ఎంజీఆర్ ఆశీస్సులతో పార్టీ ప్రచార కార్యదర్శిగా, ఎంపీగా క్రియాశీలంగా ఉండగా.. నేడు జయ నమ్మినబంటుగా ఆమె పరోక్షంలో ఆమె ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా పనిచేసిన పన్నీర్సెల్వం అధికారం తనకే దక్కుతుందని ప్రకటించారు. శశికళ తన వర్గం ఎమ్మెల్యేలందరినీ రిసార్టుకు తరలించి శిబిరం నడిపారు. పన్నీర్సెల్వం వైపు కేవలం పది మంది మాత్రమే నిలిచారు. అయితే.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనూహ్యంగా దోషిగా నిర్ధారితురాలై శశికళ జైలుకు వెళ్లడంతో.. ఆమె తన స్థానంలో పళనిస్వామిని అధికార రేసులోకి పంపారు.
 
ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతున్న పళనిస్వామితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించిన గవర్నర్ విద్యాసాగర్రావు.. సభలో 15 రోజుల్లోగా బలనిరూపణ చేసుకోవాలని నిర్దేశించారు. ఆ మేరకు శనివారం సభలో విశ్వాసపరీక్ష నిర్వహించగా.. మళ్లీ ఆనాటి గందరగోళమే చెలరేగింది. అయితే.. ఈసారి పన్నీర్ సెల్వం బలం తక్కువగా ఉండటంతో.. బలంగా ఉన్న ప్రతిపక్షం ‘క్రియాశీల’మవటమే తేడా. రహస్య బ్యాలెట్ ఓటింగ్‌కు పట్టుబడుతూ ఆందోళనకు దిగిన డీఎంకే సభ్యులను బయటకు పంపించిన స్పీకర్.. విశ్వాసప పరీక్షలో పళనిస్వామి నెగ్గినట్లు ప్రకటించారు. 
 
‘చరిత్ర పునరావృతమవుతుంది.. మొదట విషాదంగా, తర్వాత ప్రహసనంగా!’ అన్నాడు కార్ల్ మార్క్స్. తమిళనాడు పరిణామాలు సరిగ్గా దాన్నే ప్రతిబింబిస్తున్నాయి.