శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2015 (09:20 IST)

వారంతా ఉగ్రవాదులు కావొచ్చు.. ఓ కంట కనిపెట్టండి : త్రిపుర గవర్నర్ ట్వీట్

ముంబై వరుస పేలుళ్ళ కేసులో దోషిగా తేలి ఉరికంభమెక్కిన యాకుబ్ మెమన్ అంత్యక్రియలకు హాజరైన వారంతా ఉగ్రవాదులతో సమానమని, అందువల్ల వారిని ఓ కంట కనిపెట్టాలని త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ వివాదాస్పద ట్వీట్ చేశారు. ఒక రాష్ట్ర గవర్నర్ హోదాలో ఉండి ఈ తరహా ట్వీట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, దేశం హితం కోసం తనకు గవర్నర్‌గిరి పెద్ద అడ్డంకి కాబోదని తనపై విమర్శలు చేసిన వారికి ధీటుగానే సమాధానమిచ్చారు. 
 
యాకుబ్ మెమన్‌ను జూన్ 30వ తేదీన నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉరితీసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత మృతదేహాన్ని ఆయన కుటుంబీకులకు అప్పగించారు. దీంతో మెమన్ అంత్యక్రియలు ముంబైలో జరిగాయి. ఈ అంత్యక్రియలకు ఆయన కుటుంబీకులతో పాటు.. అనేక మంది హాజరయ్యారు. వీరిలో మెమన్ కుటుంబీకులు, స్నేహితులు మినహా మిగిలినవారు ఉమగ్రవాదులయ్యే అవకాశం ఉందని, వారిపై నిఘా విభాగం దృష్టిసారించాలని సూచించారు. 
 
అంతేకాకుండా, ఉరిశిక్షకు గురైన వ్యక్తిని చూడడానికి వచ్చారంటే.. అతడిపై వారికి సానుభూతి ఉందనే అర్థం. నేను ఫలానా మతంవారిపైనే నిఘాపెట్టాలని చెప్పడంలేదన్నారు. ప్రజాహితసంబంధమైన అంశాన్ని అందరి దృష్టికి తీసుకురావడం రాజ్యాంగపరమైన బాధ్యత. దానిని నేను నెరవేర్చాను. ఇందులో ఎలాంటి వివాదం లేదని త్రిపుర గవర్నర్‌ తథాగతరాయ్‌ వ్యాఖ్యానించారు.