శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (17:26 IST)

జయలలిత కాళ్లు తొలగించలేదు.. అవయవాలు మార్చలేదు : లండన్ వైద్యుడు

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత అనారోగ్యానికి గురై చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరినపుడు ఆమె కాళ్లు తొలగించినట్టు, ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా అవయవ మార్పిడి చేయలేదని లండన్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ బాలే

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యానికి గురై చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరినపుడు ఆమె కాళ్లు తొలగించినట్టు వచ్చిన వార్తలను లండన్ వైద్యుడు రిచర్డ్ బాలే ఖండించారు. ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా అవయవ మార్పిడి చేయలేదని స్పష్టం చేశారు. జయలలిత మరణంపై ఉన్న అనుమానాలను ఆయన సోమవారం మీడియా సమావేశం ద్వారా నివృత్తి చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ జయలలితకు చికిత్స అందిస్తున్న సమయంలో ఏ శరీర అవయవాన్ని తొలగించడం గానీ, ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా అవయవ మార్పిడి చేయడం గానీ జరగలేదని స్పష్టం చేశారు. ఆమె ఆస్పత్రిలో చేరినప్పుడు కనీసం మాట్లాడలేకపోయారనీ... కొద్దిమేర చికిత్స అందించిన తర్వాత స్పృహలోకి వచ్చి మాట్లాడడం మొదలుపెట్టారన్నారు. 
 
ఆస్పత్రిలో చేరగానే ముందుగా ఆమె ఆరోగ్య పరిస్థితిని స్థిరంగా ఉంచేందుకు వైద్యులు ప్రయత్నించారన్నారు. మెడికల్ టేపులు వేసిన కారణంగానే జయలలిత ముఖంపై గాయపు గుర్తులు పడ్డాయన్నారు. వ్యక్తిగత విషయాలను ఫోటోలు తీయడం, బహిరంగపర్చడం మంచిపద్ధతి కాదనీ.. అది ఆమె ప్రైవసీకి భంగం కలిగించడమేనన్నారు.
 
అలాగే, ఎవరైనా చికిత్స పొందుతున్నప్పుడు ట్రీట్ మెంట్ ను సీసీ కెమెరాల్లో రికార్డు చేయడం సరికాదని రిచర్డ్ బేలే తెలిపారు. పేషెంట్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉంటే... ఫొటోలు, వీడియోలు ఎలా తీయగలమని ప్రశ్నించారు. తమ మీద ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదన్నారు. జయ చికిత్సకు రూ.5.5 కోట్లు ఖర్చయిందని అపోలో వైద్యులు తెలిపారు. చివరి నిమిషం వరకు ఆమె మాట్లాడుతూనే ఉన్నారని వెల్లడించారు. గవర్నర్ వచ్చినప్పుడు కూడా తాను బాగానే ఉన్నట్టు సైగలు చేశారని చెప్పారు. 
 
గుండె పోటు ఎప్పుడు వస్తుందో ముందే ఊహించలేమని చెప్పారు. జయ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం వల్లే ఎవరినీ లోపలకు అనుమతించలేదని తెలిపారు. శశికళకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మాత్రం ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వచ్చామని అపోలో వైద్యులు వెల్లడించారు.