శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 2 జులై 2015 (16:30 IST)

ఏం... మంత్రుల కోసం ఎయిర్‌ఇండియా ఫ్లైట్స్ ఆపారా...? నివేదిక ఇవ్వండి...

కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి కోసం ఎయిర్‌ఇండియా విమానాలను ఆపారా..? అసలు ఎందుకు అలా ఆపాల్సి వచ్చిందో తమకు నివేదిక ఇవ్వాలంటూ కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ ఎయిర్ ఇండియాను కోరింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పాస్‌పోర్టు సమస్యతో గంటపాటు విమానం ఆగింది. ఇప్పుడు కేంద్రమంత్రి రిజుజు కోసం విమానం నుంచి ముగ్గురు ప్రయాణికులను దించేశారు. దీనిపై సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో కేంద్రం వెంటనే స్పందించింది. ఈ రెండు ఘటనలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
 
ఈ నెల 24వ తేదీన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు.. ఆయన సహాయకురాలు కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు లేహ్ వెళ్లారు. అక్కడ నుంచి తిరుగు ప్రయాణంలో ప్రత్యేక హెలికాప్టర్‌లో రావాల్సి వుంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో లేహ్ నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చేందుకు నిర్ణయించుకుని ఎయిర్‌పోర్టుకు వచ్చారు. 
 
దీంతో అప్పటికే విమానంలో కూర్చొని వున్న ముగ్గురు ప్రయాణికులను కేంద్రమంత్రి కోసం కిందికి దించేసి, కేంద్రమంత్రికి, ఆయన సహాయకులకు సీటు కేటాయించారు. ఈ చర్య తీవ్ర విమర్శలకు దారితీసింది. పైగా.. కేంద్రమంత్రి కోసం విమానాన్ని గంటకు పైగా నిలిపేశారని ఇతర ప్రయాణికులు కూడా ఆరోపిస్తున్నారు.
 
అయితే, ఈ వివాదంపై కిరణ్ రిజిజు మరోలా వాదన వినిపిస్తున్నారు. తాము విమానాశ్రయానికి వెళ్లేసరికి విమానం డోర్లు మూసివేశారని, 11:40 గంటలకు బయలుదేరాల్సిన విమానం 10:20కే బయలుదేరడం ఏంటని తాము ప్రశ్నించగా, కాసేపటి అనంతరం మమ్మల్ని విమానంలోకి వెళ్లనిచ్చారని తెలిపారు. ముగ్గురిని కిందకు దించారని వచ్చిన వార్తల గురించి తనకు తెలియదని, అలా జరిగితే అది తప్పేనని అన్నారు.
 
ఇలాంటి ఘటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలోనూ జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ సహాయకుడి మతిమరుపు కారణంగా అంతర్జాతీయ ప్రయాణీకులు గంటకుపైగా వేచి ఉండాల్సిన స్థితి ఏర్పడింది. ఈ సంఘటన మంగళవారం ముంబయిలో జరిగింది.
 
మహారాష్ట్ర సీఎం కారణంగా ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం గంట ఆలస్యంగా బయల్దేరింది. తన బృందంతో న్యూయార్క్ వెళ్తున్న ఫడ్నవిస్ సరైన సమయానికే శివాజీ టెర్మినల్‌కు చేరుకున్నారు. కానీ ఆయన సహాయకుడు కొత్త పాస్‌పోర్టుకు బదులు కాలంచెల్లిన పాస్‌పోర్టును తెచ్చాడు. దీంతో కొత్త పాస్‌పోర్ట్ కోసం సిబ్బంది ఆయనింటికి వెళ్లి దానిని తెచ్చేసరికి లేట్ అయిందట. అదీ సంగతి.
 
ఇలా విమానాలను సిటీ బస్సుల మాదిరిగా ఆపేస్తూ, ప్రయాణికులను దింపేస్తూ ఉండటంపై తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. విమానాలను తమ సొంత ఆస్తుల్లా మంత్రులు ఉపయోగించుకుంటున్నారనీ, విఐపి కల్చర్ కు తెరతీశారంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దీంతో విమానయాన శాఖ నివేదిక కోరింది.