శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 8 జూన్ 2016 (10:41 IST)

'వీరప్పన్‌' వేట ఎలా సాగిందంటే.. 'ఆపరేషన్ కుకూన్'పై విజయకుమార్

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్. వీరప్పన్ జీవించివున్నంత కాలం ఇరు రాష్ట్రాల అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. 20 ఏళ్ల పాటు అడవికి రారాజుగా ఉన్నాడు. గంధపు చెక్కలు, ఏనుగు దంతాలు అక్రమంగా రవాణా చేశాడు. పోలీసు, అటవీశాఖలకు చెందిన 180 మందిని హతమార్చాడు. 200కు పైగా ఏనుగులను పొట్టన బెట్టుకున్నాడు. మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. 
 
అలాంటి వీరప్పన్‌ను పట్టుకునేందుకు 2003లో టాస్క్‌ఫోర్స్‌ అధినేతగా ఐపీఎస్‌ అధికారి కె.విజయ కుమార్‌ను అప్పటి జయలలిత ప్రభుత్వం నియమించింది. వీరప్పన్‌ను పట్టుకునేందుకు 'ఆపరేషన్ కుకూన్‌'ను విజయకుమార్‌ అమలు చేశారు. అందులో భాగంగా వెల్లదురై అనే కానిస్టేబుల్‌ను వీరప్పన్ ముఠాలో సహాయకుడిగా చేర్పించారు. వెల్లదురై కొంతకాలానికి వీరప్పన్‌కు కుడిభుజంగా మారాడు. ఆ సమయంలో వీరప్పన్ నేత్ర ఆపరేషన్ కోసం 2004 అక్టోబర్‌ 10న ఆస్పత్రిలో చేరేందుకు అడవి నుండి వెలుపలికి వచ్చారు. ఈ విషయాన్ని విజయకుమార్‌కు వెల్లదురై చేరవేశాడు. 
 
దీంతో ధర్మపురి జిల్లా పాప్పారపట్టి గ్రామానికి తీసుకునిరాగా, అప్పటికే అక్కడ మాటువేసిన పోలీసులు వీరప్పన్ ముఠాను చుట్టుముట్టి తూటాల వర్షం కురిపించారు. ఈ తూటాలకు వీరప్పన్ కుప్పకూలగా, తీవ్రంగా గాయపడిన అనుచరులు ఆసుపత్రికి తీసుకెళుతుండగా మరణించారు. అత్యంత ఆసక్తికరమైన ఈ వివరాలను పూసగుచ్చినట్లుగా విజయకుమార్‌ తన 1000 పేజీల పుస్తకంలో పొందుపర్చారు. ఈ పుస్తకం త్వరలో విడుదల కానుంది.