శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 జులై 2014 (14:22 IST)

విజయకాంత్‌కు ఏమైంది? వీల్ ఛైర్‌లో ఎందుకొచ్చారు..?

డీఎండీకే అధినేత విజయకాంత్‌కు ఏమైంది అనేదే ప్రస్తుతం తమిళనాడు ప్రజల్లో మెదలుతున్న ప్రశ్న. విజయకాంత్ అనారోగ్యానికి గురయ్యారని.. సింగపూర్‌లో ఆయనకు శస్త్రచికిత్స జరిగిందని సమాచారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో పాటు పార్టీలో కొంతమంది జంప్ జిలానీలు తయారుకావడం ఆయనను మనోవేదనను గురిచేసిందని తెలిసింది. 
 
కొద్ది రోజుల క్రితం చెన్నైలో ఆయన చికిత్స పొందారు. అనంతరం తన సతీమణి ప్రేమలతతో కలసి ఈనెల 13న సింగపూర్ వెళ్లారు. ఈ పర్యటన వివరాలను అత్యంత గోప్యంగా ఉంచారు. రెండు వారాల పాటు సింగపూర్‌లో ఉన్న కెప్టెన్ చెన్నైకి ఆదివారం తిరుగుప్రయాణం అయ్యారు. 
 
ఆదివారం ఉదయం 10.10కి సిల్క్ ఎయిర్ వేస్ విమానం చెన్నైలో ల్యాండ్ అయింది. అయితే కెప్టెన్ భార్య ప్రేమలత మాత్రమే తొలుత బయటకు వచ్చారు. విజయకాంత్ రాలేదని సూచించడానికే ఆమె ఒక్కరే బయటకు వచ్చారు. అయినా మీడియా అక్కడే వేచి ఉంది. కాసేపటి తర్వాత విజయకాంత్‌ను వీల్ ఛైర్ లో సిబ్బంది బయటకు తీసుకొచ్చారు.
 
అతని శరీరంపై దుప్పటి కప్పి ఉంది. మీడియా కంటపడకుండా కారులోకి ఎక్కించి ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఇదంతా మీడియాకు తెలిసిపోయింది. అయితే, విజయకాంత్‌కు ఏమయిందన్న విషయం పార్టీ వర్గాలకు కూడా తెలియని పరిస్థితి. విజయకాంత్‌కు సింగపూర్‌లో శస్త్రచికిత్స జరిగిందన్న వదంతులూ వ్యాపిస్తున్నాయి. వీల్ చెయిర్‌లో రావడంతో ఈ వదంతులకు బలం చేకూరుతోంది.