మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chj
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (18:49 IST)

జయహో- పీఎస్‌ఎల్వీ-సి 37: ఏకకాలంలో నింగిలోకి 104 ఉపగ్రహాలు.. కౌంట్ డౌన్ ప్రారంభం

2017 ఫిబ్రవరి15 భారతదేశం అంతరిక్ష రంగంలో అత్యున్నతమైన మరో మైలురాయి దాటడానికి సమాయత్తం అవుతుంది. ప్రపంచంలో ఏ దేశం చేయని ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టడానికి సాహసించే ప్రయత్నం చేయబోతుంది.

2017 ఫిబ్రవరి15 భారతదేశం అంతరిక్ష రంగంలో అత్యున్నతమైన మరో మైలురాయి దాటడానికి సమాయత్తం అవుతుంది. ప్రపంచంలో ఏ దేశం చేయని ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టడానికి సాహసించే ప్రయత్నం చేయబోతుంది. ఇస్రో బుధవారం ఉదయం శ్రీహరికోటనుంచి పీఎస్‌ఎల్వీ–సి 37 రాకెట్‌కు మొత్తం నూటనాలుగు ఉపగ్రహాలను తగిలించి నింగిలోకి సంధించబోతున్నది. 
 
ఇందులో అమెరికా, ఇజ్రాయెల్‌, స్విట్జర్లాండ్‌, నెదర్లాండ్స్‌ తదితర దేశాలకు చెందిన నూటొక్క ఉపగ్రహాలు అతిచిన్నవీ, తేలికపాటివి ఉన్నాయి. ఇందులో కేవలం 3 ఉపగ్రహాలు మాత్రమే భారత్‌కు చెందినవి. ఇస్రో 2017లో చేపడుతున్న సరికొత్త తొలి ప్రయోగం. అమెరికాకు చెందిన ఎర్త్‌ ఇమేజింగ్‌ కంపెనీ 88 క్యూబెశాట్‌లను ఒకేసారి పంపేందుకు సిద్ధం చేసింది. ఏ అంతరిక్ష సంస్థ కూడా ఈ తరహా ప్రయోగాన్ని ఇప్పటి వరకూ చేపట్టలేదు. ఇస్రో రూపొందించిన కార్టోశాట్‌-2 శ్రేణులలోని ప్రధాన రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాన్ని, రెండు చిన్న అంతరిక్ష నౌకలను, దాదాపు 101 చిన్న విదేశీ వాణిజ్య ఉపగ్రహాలను ఈ ప్రయోగంలో పిఎస్‌ఎల్‌వి-37 తనతో పాటు అంతరిక్షంలోకి తీసుకెళ్ళనుంది.
 
ఇప్పటి వరకు రష్యా ఇదే తరహాలో ముప్పయ్యేడు ఉపగ్రహాలను నింగికి పంపి అగ్రస్థానంలో ఉంది. అమెరికా కూడా ఆ సంఖ్యను ముప్పైలోపలే సరిపెట్టింది. ఇది ప్రపంచ దేశాల చేత శభాష్ ఇస్రో అనిపించుకుంటున్నారు మన శాస్త్రవేత్తలు. పీఎస్ఎల్వీ-సి 37 రాకాట్ ద్వారా 104 ఉపగ్రహాలను ఏకకాలంలో అంతరిక్షంలోకి పంపేందుకు కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. బుధవారం ఉదయం సరిగ్గా 9గంటల 28 నిమిషాలకు పీఎస్‌ఎల్వీ-సీ37 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగికేగనుంది.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రపంచ నలుమూలలా భారత్ కీర్తి ఇనుమడించనుంది. 
 
నాలుగుదశాబ్దాల కిందట ఆర్యభట్టను ప్రయోగించడానికి నలుగురినీ వేడుకోవాల్సివచ్చిన ఇస్రో ఇప్పుడు అగ్రరాజ్యాలు చేయని సాహసాలతో ప్రపంచదేశాలన్నింటినీ నివ్వెరపరుస్తున్నది. భారతదేశాన్ని అంతరిక్ష విజ్ఞానంలో అగ్రరాజ్యాలకు ధీటుగా నిలబెట్టేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నది. మన ఇస్రో చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతం కావాలని యావత్ భారతావని మనసారా కోరుకుంటుంది. జై జవాన్...జై కిసాన్...జై విజ్ఞాన్.