శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 30 నవంబరు 2015 (15:56 IST)

శనిదేవుడికి మహిళలు పూజలు... సంప్రదాయం బద్ధలు... ఏడుగురు సెక్యూరిటీ సస్పెండ్

శని సింగ్నాపూర్... మహారాష్ట్రలోని ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ శనిదేవుడికి ఎలాంటి గుడి ఉండదు. కేవలం ఓ రాతి శిల్పం ఉంటుంది. ఆ శిల్పానికి పైకప్పుగా ఎలాంటి కట్టడాలు కనిపించవు. శనిదేవుడిని చేరి కొలిచేందుకు ఇక్కడ పురుషులకు మాత్రమే ప్రవేశం. స్త్రీలకు ప్రవేశం నిషిద్ధం. ఐతే ఆదివారం నాడు ఈ సంప్రదాయానికి గండి పడింది. ఇద్దరు మహిళలు సెక్యూరిటీని దాటుకుని ఏడు మెట్లు ఎక్కి శనిదేవుడిని అర్చించి వెళ్లిపోయింది. 
 
ఈ విషయం శని సింగ్నాపూర్ తోపాటు అహ్మద్ నగర్ జిల్లాతో పాటు దేశవ్యాప్తంగా పాకింది. దీనితో మహిళలు శనిదేవుడిని పూజించి అపచారం చేసిందని అక్కడి గ్రామస్తలు మండిపడుతున్నారు. మరోవైపు ఆలయ కమిటీ శని దేవుడికి కాపలాగా ఉంటున్న ఏడుగురు సెక్యూరిటీ సిబ్బందిని సస్పెండ్ చేసింది. మహిళలు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు శనిదేవుడికి పాలాభిషేకం చేస్తున్నారు. 
 
మరోవైపు ఆ ఇద్దరు మహిళలు సాహసం చేసి మూఢాచారాలను తరిమికొట్టారని మరికొందరు అంటున్నారు. మాజీ కేంద్రహోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కుమార్తె, షోలాపూర్ ఎమ్మెల్యే అయిన ప్రణితి ఈ ఘటనపై స్పందిస్తూ.... శనిదేవుడికి పూజ చేసిన ఆ మహిళలను సన్మానించాలన్నారు. ఇలాంటి ధైర్యవంతులను సన్మానించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.