శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (14:34 IST)

అనుమతివ్వండి ఆమెను పెళ్లి చేసుకుంటా: అబూసలేం

మాఫియా డాన్ అబూసలేం తనను పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చిన యువతిని పెళ్లాడేందుకు సిద్ధమయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి అనుమతించాలని సలేం సోమవారం టాడా కోర్టును కోరాడు. అబూసలేంను పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ 26 ఏళ్ల యువతి పట్టుబట్టింది. తనకూ అబూసలేంకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ.. పోలీసులు చేసిన దుష్ప్రచారం వల్ల తనను పెళ్లి చేసుకునేందుకు ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదని అందువల్ల పోలీసులు చెప్పిన అబద్ధాన్నే నిజం చేసేందుకు సిద్ధమైనట్టు ఆ యువతి తెలిపింది. ఈ మేరకు ఆమె టాడా కోర్టుకు ఒక లేఖ కూడా రాశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... థానే జిల్లాకు చెందిన సయ్యద్ బహర్ కౌసర్ అనే యువతి అవివాహిత. ఈమెకు మాఫియా డాన్, గ్యాంగ్‌స్టర్ అబూసలేంకు సంబంధం ఉన్నట్టు స్థానిక పోలీసులు ఆరోపిస్తూ ఆమెతో పాటు ఆమె బంధువుల వద్ద అనేకమార్లు విచారణ జరిపారు. ముఖ్యంగా 2014లో సలేంను జైలుకు తరలిస్తుండగా రైలులోనే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారన్నది పోలీసుల ఆరోపణ. అయితే అప్పట్నుంచే కౌసర్‌కు సమస్యలు మొదలయ్యాయి. 
 
ఆ తర్వాత ఆమె గురించి చాలామంది పలు రకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకురాలేదు. ‘ఫోటోలను మార్ఫింగ్ చేసి పోలీసులు నా జీవితం నాశనం చేశారు. దీంతో ఇక ఈ అబద్ధాన్నే నిజం చేయాలనుకుంటున్నాను. సలేంను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాన’ని టాడా కోర్టుకు రాసిన లేఖలో కౌసర్ రాసింది. కౌసర్ పోరాటానికి ఆమె కుటుంబ సభ్యులు మద్ధతుగా నిలిచారు. 
 
ఈ స్థితిలో ఆమెను పెళ్లి చేసుకోవడానికి సలేం కూడా సిద్ధమయ్యాడు. మరి వీరి పెళ్లికి టాడా కోర్టు అనుమతి ఇస్తుందో లేదో వేచి చూడాలి.