శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 27 ఆగస్టు 2014 (16:06 IST)

రికార్డులు తిరగెయ్ బాబూ.. జగనూ పెరిగింది వేరే విధం..!

అసెంబ్లీ నడిచే తీరుకు నిరసన వ్యక్తం చేయడం మినహా మరో మార్గం లేదని, చంద్రబాబు మాట్లాడిన రికార్డులు తిరగేయాలని వైకాపా అధినేత జగన్ అన్నారు.  వాస్తవాలు చెప్పేందుకు తాము మాట్లాడదల్చుకున్నామని చెప్పారు.
 
గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఎన్ని గంటలు మాట్లాడాలో రికార్డులు తిరగేయాలన్నారు. గత పదేళ్లలో బడ్జెట్ మీద ప్రతిపక్ష నేతలు చర్చపై ఎంత సమయం తీసుకున్నారో పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఉన్నది ఒక్క ప్రతిపక్షమేనని, తమకూ మైక్ ఇవ్వడం ఇష్టం లేనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.
 
సభలో యనమల మాట్లాడుతూ.. విపక్ష నేత హౌస్ అంటే తన హౌస్ అనుకుంటున్నారని యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. సమయం కేటాయింపు పైన స్పీకర్‌దే తుది నిర్ణయమన్నారు. ప్రతిపక్ష నేత వాకౌట్ చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. 
 
30 ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని, ఇప్పటి వరకు జగన్ లాంటి ప్రతిపక్ష నేతను తాను చూడలేదన్నారు. గతంలో ఏ ప్రతిపక్ష నేతైనా ప్రజా సమస్యల కోసం అధికార పక్షాన్ని నిలదీసి, సభ నుంచి వాకౌట్ చేసేవారని, కానీ అందుకు విరుద్దంగా జగన్ ఏ కారణం లేకుండా వాకౌట్ చేస్తున్నారన్నారు.
 
వాకౌట్ చేసేడప్పుడు సభ్యులు ఎందుకు చేస్తున్నామో స్పీకర్‌కు చెప్పి వాకౌట్ చేస్తారని, అది సభా మర్యాద అని, కానీ జగన్ కనీసం వాకౌట్ చేస్తున్నానన్న విషయం స్పీకర్‌కు చెప్పకుండా సభ నుంచి బయటకు వెళ్లిపోతున్నారన్నారు. 
 
జగన్ బయటకు వెళుతుంటే, మిగతా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు ఆయనను సైలైంట్‌గా అనుసరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు జగన్ పెరిగిన తీరే వేరే విధంగా ఉందని అనిపిస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.