శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (18:46 IST)

కాలిఫోర్నియా శాక్రమెంటో మన బడి తెలుగు తరగతులు

కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న శాక్రమెంటో తెలుగు అసోసియేషన్ (టీఏజీఎస్) సౌజన్యంతో శాక్రమెంటో శివారు నగరం ఫాల్సోం  గోల్డ్ రిడ్జ్ స్కూల్‌లో ఆదివారం  సెప్టెంబర్ 11, 2016  నుండి సిలికానాంధ్ర మనబడి తెలుగు తరగతులు ప్రారంభం అవుతాయని టీఏజీఎస్ ప్రకటించింది.
  
శాక్రమెంటోలో ఉన్న తెలుగు కుటుంబాలకు చెందిన పిల్లలకు తెలుగు నేర్పడానికి గత నాలుగు ఏండ్లుగా  టీఏజీఎస్ చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి ప్రోత్సాహం ఇవ్వాలని శాక్రమెంటో తెలుగువారందరికీ టీఏజీఎస్ అధ్యక్షులు వెంకట్ నాగం విజ్ఞప్తి చేసారు. 2016-2017 సంవత్సరానికి పెద్దఎత్తున తమ పిల్లలని చేర్పించి ప్రోత్సాహం ఇవ్వాలని టీఏజీఎస్ మనబడి సమన్వయకర్త  నాగి దొండపాటి శాక్రమెంటో తెలుగువారందరికీ విజ్ఞప్తి చేసారు. 
 
గత సంవత్సరంలో హైదరాబాద్ పొట్టి  శ్రీరాములు  విశ్వవిద్యాలయం  వారిచే ఫాల్సంలో జరపబడ్డ "తెలుగు  జూనియర్ సర్టిఫికెట్ పరీక్ష"లో ఫాల్సం మనబడి విద్యార్థులు నూరు శాతం ఫలితాలు సాధించిన విషయం గుర్తు చేస్తూ, శాక్రమెంటోలో గత నాలుగు ఏండ్లుగా మనబడి తరగతులను విజయవంతం  చేసిన వారందరికీ వారు  అభినందనలు తెలిపారు.
 
కాలిఫోర్నియా శాక్రమెంటోలో మనబడికి స్వచ్ఛందంగా పనిచేస్తున్న స్థానిక అధ్యాపకులు "ప్రసాద్ పన్నాల, విజయలక్ష్మి పన్నాల, మోహన్ పెంటా, భాస్కర్ వెంపటి, సౌమ్య", మనబడి ప్రణాళిక బృందాన్ని మరియు, కార్యకర్తలు 2016-2017 సంవత్సరానికి మనబడి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని, కాబట్టి స్థానిక తెలుగువారు ఈ సౌకర్యం ఉపయోగించుకోవాలని టీఏజీఎస్ పత్రికాముఖంగా అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. శాక్రమెంటోలో మనబడి బాలబడి, ప్రవేశం, ప్రసూనాం, ప్రకాశం, ప్రభాసం తరగతుల్లో పిల్లలను చేర్పించదలచుకున్నవారు మరింత సమాచారం కోసం టీఏజీస్ సమన్వయకర్త నాగి దొండపాటిని ఇ-మెయిలు telugusac.manabadi ఎట్ gmail.com లో సంప్రదించగలరు అని టీఏజీఎ కార్యవర్గం ప్రకటించింది.