శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By Selvi
Last Updated : గురువారం, 21 ఆగస్టు 2014 (19:27 IST)

చిన్న చిన్న విషయాలను భూతద్దంలో పెట్టి చూడకండి!

మీకు సంబంధించినంత వరకు జరిగే చిన్న విషయాలను భూతద్దంలో పెట్టి చూడకండి. అలా అయితేనే మీరు మీ కెరీర్‌లో విజయం సాధించగలుగుతారు. లేదంటే మనసులో సంకోచాలు విజయ బాటకు అడ్డు తగులుతుంటాయి. జీవితంలో ఎత్తు పల్లాలు, లాభనష్టాలు ఉంటాయని గుర్తుంచుకోండి.
 
మిమ్మల్ని ఎవరైనా నలుగురిలో బాధపెడితే అది ఓ పెద్ద అవమానంగా భావించకండి. దానిలో ఉన్న మంచిని తీసుకోండి. లేదా అలాగే వదిలేయండి. సరదాగా మామూలుగా అందరితో మాట్లాడండి. అప్పుడు వారి తప్పు వారికే తెలుస్తుంది. 
 
ఏ విషయమైనా సర్దుకోవడం నేర్చుకోండి. ఇలా చేయడంతో మీపై మీకు విశ్వాసం పెరగడమే కాకుండా మనసు తేలికవుతుంది. ఉదాహరణకు లత తన ఆఫీసు పనిలో చిన్న తప్పు చేసింది. దానిని తన పైఅధికారి సరిదిద్దాడు. అప్పట్నుంచీ తనను అందరూ అదోలా చూస్తున్నారని మనసులో కుమిలి పోవడం ప్రారంభించింది.
 
ఇలాంటి విషయాలు మన చుట్టూ తరచూ జరుగుతుంటాయి. అయితే నిజానికి వాళ్లు ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయి ఉంటారు. మనం మాత్రం దానిని మనసులో గుర్తు చెసుకుంటూ మనశ్సాంతిని దూరం చేసుకుంటుంటాం. ఇలా చేయడంతో ఏకాగ్రతా లోపం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ విషయాన్నైనా ఎక్కువ సేపు ఆలోచించకండి. మీరు చేసిన పని తప్పైతే దానిని మరోమారు రాకుండా చూసుకోండి.
 
ఇటువంటి తప్పులు, పొరపాటులు అందరి జీవితాలలో సహజమైనవేనని మీ మనసుకు చెప్పుకోండి. మిమ్మిల్ని అస్తమానం సూటిపోటి మాటలతో బాధపెట్టేవారి గురించి ఆలోచించకండి. వారి గురించి, వీరి గురించి ఆలోచించడం మానేసి మీరు, మీ అభివృద్ధికి కావలసిన మార్గాలను అన్వేషించండి. తప్పకుండా విజయం మీ సొంతమవుతుంది.