శనివారం, 23 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : శుక్రవారం, 31 మే 2019 (15:49 IST)

భక్తి అంటే ఏమిటి..? అందులోని రకాలెన్ని?

భక్తి అనేది ఒక పవిత్రమైన భావన. మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు. భక్తి అనేక రకాలుగా ఉంటుంది. భగవంతుని అనుగ్రహం పొందడానికి భాగవతంలో నవవిధ భక్తులు అనగా 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి. ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉంది. అసలు భక్తి ఎన్ని రకాలు, ఎటువంటి భక్తిని కలిగి ఉండటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇక్కడ తెలుసుకుందాం: 
 
* శ్రవణ భక్తి :
సత్‌పురుషుల వాక్యాలు, సత్‌గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీని వల్ల మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. పరీక్షిత్తు శ్రవణ భక్తిని ఆశ్రయించి మోక్షాన్ని పొందాడు.
 
* కీర్తనా భక్తి :
భగవంతుని గొప్ప లక్షణాలను కీర్తించడమే కీర్తనా భక్తి. భగవంతుని సాక్షాత్కారం కోసం కీర్తన భక్తి ఉత్తమమైనది. వాల్మీకి, నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు, ఆళ్వారులు, నయనార్లు, రామదాసు మొదలైన వారు కీర్తన భక్తితో మోక్షం పొందారు.
 
* స్మరణ భక్తి :
భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకొని స్మరించడమే స్మరణ భక్తి. ఇందులో నామ స్మరణం, రూప స్మరణం, స్వరూప స్మరణం అని మూడు రకాలు ఉన్నాయి. మునులు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, తులసీదాసు త్యాగరాజు మొదలైన వారు స్మరణ భక్తితో ధన్యులైనారు.
 
* పాదసేవన భక్తి :
భగవంతుని సర్వావయవాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు. వీటిని సేవించిన భక్తులకు భగవంతుని పవిత్రసేవ చేసుకున్న ఫలితం వస్తుంది. భరతుడు, గుహుడు మొదలైన వారు ఈ పాదసేవ ద్వారా ముక్తులైనారు.
 
* అర్చన భక్తి :
ప్రతిరోజు తులసి పుష్పాదులు, ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చన రూపంలో దేవుని పూజించడమే అర్చనా భక్తి. మానవులు తాము నమ్ముకున్న భగవంతుని అర్చనా మూర్తులను ప్రతిష్టించుకొని పూజాద్రవ్యాలతో ధూప దీప నైవేద్యాలతో దేవతలను అర్చించడం ప్రస్తుత సమాజంలో ఎంతో ప్రాచుర్యంలో ఉంది.
 
* వందన భక్తి :
వందనం అంటే నమస్కరించడం. తనయందు మనస్సు నిలిపి భక్తులై పూజింపుమని, నమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్భోదించాడు. ఎన్ని యాగాలు చేసినా, శాస్త్రాలు చదివినా భగవంతుని నమస్కరించని వాడు ఆ ఫలితాన్ని పొందలేడు.
 
* దాస్య భక్తి :
ప్రతి మనిషి తనకు ఇష్టమైన దేవునికు ఎల్లప్పుడు సేవకుడై, దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి. కులశేఖర అళ్వారు దాస్య భక్తికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. హనుమంతుడు, లక్ష్మణుడు మొదలైన వారు దాస్య భక్తిని ఆశ్రయించి ముక్తిని పొందారు.
 
* సఖ్య భక్తి :
సఖ్యం అనగా స్నేహం. భగవంతునితో సఖ్యత ఏర్పరచుకున్న వారు ధన్యులు. అర్జునుడు, సుగ్రీవుడు మొదలైన వారు సఖ్య భక్తితో స్వామికి ప్రీతిపాత్రులైనారు.
 
* ఆత్మ నివేదన భక్తి లేదా ప్రపత్తి :
ఆత్మనివేదన మనగా భగవంతుడు తప్ప ఇంకెవరూలేరని శరణాగతి కోరడం. భక్తి మార్గాలన్నిటికన్నా ఆత్మనివేదన మోక్షమార్గానికి సులభమైన మార్గం. ఈ మార్గాన ద్రౌపతి, గజేంద్రాదులు ముక్తి పొందారు.