ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: గురువారం, 20 సెప్టెంబరు 2018 (18:08 IST)

నీ భర్త బ్రతకాలంటే ఈ ఔషధం మింగి నువ్వు చనిపోవాలి... మరి భార్య ఏమన్నదంటే?

ఒక గురువు తన శిష్యునితో ఇలా అన్నాడు. సంసారం అనేది మిధ్య... నువ్వు నాతోపాటు వచ్చేయి అన్నారు. దాంతో శిష్యుడు, అయ్యా... మా అమ్మానాన్న, భార్య-వీరందరూ నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు. వీరిని వదిలి నేనెలా రాగలను అన్నాడు. అందుకు గురువు అతనితో నువ్వు.. నావాళ్లు

ఒక గురువు తన శిష్యునితో ఇలా అన్నాడు. సంసారం అనేది మిధ్య... నువ్వు నాతోపాటు వచ్చేయి అన్నారు. దాంతో శిష్యుడు, అయ్యా... మా అమ్మానాన్న, భార్య-వీరందరూ నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు. వీరిని వదిలి నేనెలా రాగలను అన్నాడు. అందుకు గురువు అతనితో నువ్వు.. నావాళ్లు, నావాళ్లు అంటున్నావు, నిన్ను ప్రేమిస్తున్నారంటున్నావు. అయితే ఇదంతా నీ భ్రమే. నేను నీకొక కిటుకు నేర్పుతాను. దాని ద్వారా వారు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నారా లేదా అన్న విషయం నీకు అర్థమవుతుంది అన్నారు. 
 
ఇలా పలికి గురువు శిష్యునికి ఒక గుళిక ఇచ్చి ఇంటికి వెళ్లాక దీనిని మింగు, దీని ప్రభావంతో నువ్వు పీనుగు వలె బిగుసుకుపోతావు. అయితే నీకు స్పృహ తప్పదు. చుట్టూ జరిగేదంతా వినగలవు, చూడగలవు. నేను వచ్చాక మళ్లీ క్రమంగా సాధారణ స్థితికి వచ్చేస్తావు అని చెప్పారు. శిష్యుడు ఇంటికి వెళ్లి గురువుగారు చెప్పినట్లే చేశాడు. శవంలా పడిపోయాడు. ఇంట్లో ఏడ్పులు, పెడబొబ్బలు మొదలయ్యాయి. తల్లి, భార్య  ఇంకా తక్కినవారందరూ గుండెలు బాదుకుంటూ నేలపై పడి దొర్లుతూ విలపిస్తున్నారు. 
 
అదే సమయంలో ఒక బ్రాహ్మణుడు అక్కడకు వచ్చి ఏమైందని అడిగాడు. ఇతడు చనిపోయాడు అన్నారు వారందరు. బ్రాహ్మణుడు శిష్యుని నాడిని పరీక్షించి... అరె ఇదేమిటి ఇతడు చనిపోలేదు. నేనొక ఔషధం ఇస్తాను. అది పుచ్చుకోగానే మామూలు మనిషైపోతాడు అన్నారు. ఆ మాట వినగానే ఇంట్లోని వారందరి ఆనందానికి అంతు లేకుండా పోయింది. స్వర్గం భువికి దిగి వచ్చినట్లు వారికి తోచింది. 
 
కానీ మీకొక సంగతి చెప్పాలి అంటూ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు... ఈ ఔషధాన్ని ముందుగా మరో వ్యక్తి సేవించాలి. ఆ తరువాత మిగిలిన దానిని ఇతడు సేవించాలి. అయితే ఔషధాన్ని ముందుగా సేవించిన వ్యక్తి మరణిస్తాడు. మీరందరూ ఇతనికి కావలసినవారే కదా... అందులో తల్లి, భార్య గుండెలు బాదుకుంటూ విలపిస్తున్నారే... నిస్సంశయంగా వీరు ఆ ఔషధాన్ని పుచ్చుకుంటారు అన్నారు.
 
ఆ మాట వినగానే అందరూ ఏడుపు మాని ముఖముఖాలు చూసుకోసాగారు. ఆ వ్యక్తి తల్లి ఇంత పెద్ద సంసారమే.... నేను పోతే దీనినంతా ఎవరు చూసుకుంటారు అంటూ చింతాక్రాంతురాలయ్యింది. అతని భార్య, నేను పోతే పసిపిల్లల్ని ఎవరు చూస్తారు అని ఊరకుండిపోయింది. శిష్యుడు ఇదంతా చూస్తూ వింటున్నాడు. అతడు వెంటనే లేచి నిలబడి గురువుతో ఇలా అన్నాడు. గురువర్యా..... పదండి వెళ్దాం. నేను కూడా మీతో వచ్చేస్తాను అని గురువు వెంట బయలుదేరాడు.
 
- శ్రీరామకృష్ణ పరమహంస