శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 23 అక్టోబరు 2018 (14:25 IST)

శబరిమల అయ్య(విష్ణువు) అప్ప(శివుడు) ఎందుకు పుట్టాడు?

దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో శబరిమల ఒకటి. ఇపుడీ శబరిమల ఆలయంలోకి స్త్రీల ప్రవేశంపై ఆలయం వద్ద ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే శబరిమలలో కొలువున్న అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ఏటా లక్షలాది మంది భక్తులు దేశ, విదేశాల నుంచి తరలివస్తారు. ఏడాదిలో కొద్దిరోజుల మాత్రమే స్వామివారి దర్శనం లభిస్తుంది. అయ్యప్పను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు. 
 
అయ్య( విష్ణువు), అప్ప( శివుడు) అనే పేర్ల సంగమంతో 'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషాసురుడి సోదరి మహిషిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. మహిశాసురుని జగన్మాత సంహరించడంతో దేవతలపై పగ సాధించాలని అతడి సోదరి మహిషి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది.
 
ఆమె తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగారు. శివకేశవులకు పుట్టిన సంతానం చేతిలో తప్ప ఎవరితోనూ చావులేనట్లు వరం పొందింది. అంతేకాదు హరిహర తనయుడు పన్నెండేళ్ళ పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి.

క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమృతం దేవతలు, రాక్షసులకు పంచేందుకు మోహినిగా అవతరించిన శ్రీమహా విష్ణువు కార్యం నిర్వహిస్తాడు. అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసిన శివుడు ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం, 30వ రోజు శనివారం, పంచమి తిథి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నంలో అయ్యప్ప జన్మించాడు. 
 
ఈయన శైవులకు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపా నది తీరాన మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త. ఆ తర్వాత పెరిగి పెద్దవాడై మహిషిని వధించి భక్తులను రక్షిస్తాడు అయ్యప్ప. స్వామియే శరణం అయ్యప్ప.