శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (14:29 IST)

11వ యమహా ఏషియాన్ కప్‌లో నలుగురు భారతీయ రైడర్లు!

ఇండోనేషియాలోని వెస్ట్ జావా నగరంలో ఉన్న సెంటుల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో 11వ యమహా ఏషియాన్ కప్ రేస్ 2014 పోటీలు వచ్చే నెల 6, 7 తేదీల్లో జరుగనున్నాయి. ఈ పోటీల్లో భారత్ తరపున నలుగురు జాతీయ స్థాయి రైడర్లు పాల్గొంటున్నారు. ఈ రేస్ పోటీలను యమహా మోటార్ గ్రూపు కంపెనీ అయిన పీటీ యమహా ఇండోనేషియా మోటార్ మానుఫ్యాక్చరింగ్ నిర్వహిస్తోంది. 
 
యమహా ఏషియాన్ కప్ రేస్ పోటీలను 2003లో ప్రారంభించగా, ఏషియా రీజియన్‌లో యమహా గ్రూపునకు చెందిన స్పోర్ట్ బైకుల ప్రమోషన్‌లో భాగంగా ఈ కంపెనీ తనవంతు పాత్రను పోషిస్తోంది. కాగా, డిసెంబరులో జరిగే పోటీల్లో ఆరు దేశాలకు చెందిన 72 మంది రైడర్లు ఇందులో పాల్గొంటున్నారు. వీరంతా జాతీయ స్థాయి రేసర్లు కావడం గమనార్హం. 
 
వీరిలో భారత్ తరపున జగన్ కుమార్, దీపక్ రవి కుమార్, పద్మనాభన్, రజిని కృష్ణన్‌లు ఉన్నారు. వీరు రెండు విభాగాల్లో పాల్గొంటారు. ఇందులో ఒక విభాగం ఎస్టీఆర్15 క్లాస్. ఈ విభాగం కోసం వైజడ్ఎఫ్-ఆర్15 స్ట్రీట్ స్పోర్ట్స్ మోడల్ రకం బైకును వాడుతారు. అలాగే, ఎస్టీఆర్25 విభాగం పోటీల్లో వైజడ్ఎఫ్-ఆర్25 స్పోర్ట్ మోటల్ బైకును వాడనున్నారు. 
 
ఇదే అంశంపై యమహా మోటార్ ఇండియా సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ వైస్ ప్రెసిడెంట్‌ రవీందర్ సింగ్ మాట్లాడుతూ యమహా డీఎన్ఏలోనే మోటార్ స్పోర్ట్స్ ఉన్నాయన్నారు. ఏషియా దేశాల్లో ఉన్న ఔత్సాహిక రేసర్లకు ఓ మంచి వేదికను నిర్మించడం కోసమే ఈ తరహా కప్ పోటీలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ యేడాది భారత్ నుంచి నలుగురు రైడర్లను తాము గుర్తించి, వారికి అన్ని విధాలా శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు.