శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2019 (18:39 IST)

నా లక్ష్యం 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే: పివీ సింధు

తాజాగా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి, స్వర్ణ పతకంతో సగర్వంగా స్వదేశానికి తిరిగి వచ్చిన పివీ సింధు, గోపీచంద్ అకాడమీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించింది. 
 
ఈ విజయం కోసం చాలా సంవత్సరాలుగా ఎదురు చూసానని, ఎట్టకేలకు తన కల నెరవేరిందని ఆమె అన్నారు. తన విజయపరంపరలో వెన్నంటే నిలిచిన గురువులు గోపిచంద్‌కి, కిమ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. తన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని చెప్పింది.
 
2020లో టోక్యోలో జరిగే ఒలంపిక్స్‌లో స్వర్ణం సాధించడమే తన తదుపరి లక్ష్యమని ఆమె వెల్లడించారు. ఇందుకోసం తీవ్ర పోటీ ఉంటుందని, అయినప్పటికీ వాటిని దాటుకుంటూ వెళ్లేందుకు తన వద్ద ప్రత్యేక వ్యూహాలు ఉన్నాయని, అంతేకాకుండా ఒలంపిక్స్‌కు ముందు చాలా టోర్నీలు ఆడాలని ఆమె పేర్కొంది. 
 
ఇలాంటి సూపర్ సిరీస్‌లు ఆడటం వల్ల ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ, ఎప్పటికప్పుడు తన టెక్నిక్స్ మెరుగుపరుచుకోవచ్చని ఆమె భావిస్తోంది. టాప్-10 ప్లేయర్స్ అందరికీ తమ బలాలు, బలహీనతలు తెలిసి ఉంటాయి, కాబట్టి సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగాలి. ఈ సందర్భంగా అండగా నిలిచిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది.