శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 19 ఆగస్టు 2016 (08:51 IST)

శెభాష్ సింధు... ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి... నేడు బంగారు పతక వేట

రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం పడిగాపులు కాస్తున్న 130 కోట్ల మంది భారతీయులకు... గురువారం తెల్లవారుజామున మల్లయోధురాలు సాక్షి మాలిక్‌ కాంస్య పతకంతో వీనుల విందు చేసింది.

రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం పడిగాపులు కాస్తున్న 130 కోట్ల మంది భారతీయులకు... గురువారం తెల్లవారుజామున మల్లయోధురాలు సాక్షి మాలిక్‌ కాంస్య పతకంతో వీనుల విందు చేసింది. అదే రోజు రాత్రి బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్స్‌లో పీవీ సింధు విజయ ఢంకా మోగించింది. జపాన్‌కు చెందిన ఆరో ర్యాంకర్‌ నజొమీ ఒకుహరాపై వీరోచిత ప్రదర్శనతో దుమ్మురేపింది. 
 
ఫలితంగా సెమీస్‌లో గెలిచి... రజత పతకాన్ని ఖాయం చేసుకుని, బంగారు పతకం కోసం శుక్రవారం రాత్రి వేట కొనసాగించనుంది. మరోవైపు.. పురుషులైనా, మహిళలైనా... ఒలింపిక్స్‌లో ఓ భారతీయ షట్లర్‌ ఈ ఘనత సాధించడం ఇదే ప్రథమం! అదికూడా తెలుగింటి అమ్మాయి సింధు కావడం గమనార్హం. సెమీస్‌‌లో మ్యాచ్‌ మొదలైనప్పటి నుంచీ సింధుది వీర విహారమే! 
 
ప్రత్యర్థి తట్టుకోలేనంత, తట్టుకుని నిలవలేనంత దూకుడే! ఆటలో తనకు కలిసి వచ్చిన 'ఎత్తు'గడలతో ప్రత్యర్థిని కోర్టులో మూల మూలకూ తిప్పి ముప్పుతిప్పలు పెట్టింది. కళ్లుగింగిరాలు తిరిగేలా రాకెట్‌తో షటిల్‌కాక్‌ను ఏకిపారేసింది. ఫలితంగా ఒకుహరాను 19 పాయింట్ల వద్ద నిలిపి... 21తో సింధు మ్యాచ్‌ కొట్టేసింది. విజయ గర్జన చేసింది.
 
అదేసమయంలో స్వర్ణ పతకానికి మరో అడుగు దూరంలో ఉంది. శుక్రవారం సాయంత్రం 6.55 నిమిషాలకు స్పెయిన్ క్రీడాకారిణి కోరోలినా మరిన్‌తో తలపడనుంది. పోరు ఫలితంతో సంబంధం లేకుండానే భారత్‌కు రజతం ఖాయమైంది. కాగా ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం అందించిన మహిళల్లో వెయిట్‌లిఫ్టిర్ కరణం మల్లేశ్వరి, బాక్సర్ మేరీకోమ్, షట్లర్ సైనా నెహ్వాల్ పతకాలు సాధించగా ఈ ఒలింపిక్స్‌లో గురువారం రెజ్లర్ సాక్షి మాలిక్, శుక్రవారం తెలుగమ్మాయి పీవీ సింధు ఆ జాబితాలో చేరారు.