శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (13:59 IST)

సానియా మీర్జాకు ఫుల్ సపోర్ట్: అందరూ ఆమె వెంటే.!

టెన్నిస్ తార సానియా మీర్జా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం హాట్ టాపిక్ అయ్యింది. తాను ఇండియన్‌నే.. భారత్ కోసం పతకాలు సాధించాను.. తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక కావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడం బాధేసిందని సానియా మీర్జా చెప్పింది.

అయితే తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‍గా ఆమెను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియమించడం, రానున్న యుఎస్ ఓపెన్‌కు సన్నద్ధం’ కావడానికి 1 కోటి రూపాయల చెక్కును అందచేయడం పట్ల కొన్ని వర్గాలలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. తెలంగాణ బిజెపి సీనియర్ నాయకుడు, అసెంబ్లీలో బిజెపి సభా పక్ష నాయకుడు అయిన డాక్టర్ కె. లక్ష్మణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి.
 
మహారాష్ట్రలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగి, పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్న ‘‘పాకిస్తాన్ కోడలు’’ సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎలా నియమిస్తారంటూ డాక్టర్ లక్ష్మణ్ ప్రశ్నించడంతో సానియా కూడా హైదరాబాద్‌లోని తన మూలాలను వివరిస్తూ ఒక ప్రకటన కూడా జారీ చేయవలసి వచ్చింది. తన తాత ముత్తాతల కాలం నుంచి శతాబ్దానికి పైగా తమ కుటుంబానికి హైదరాబాద్‌తో విడదీయలేని అనుబంధ ఉందని సానియా తెలిపారు.
 
తాను పాకిస్తాన్ కోడలినైనా తుది శ్వాస వరకు భారతీయురాలిగానే జీవిస్తానంటూ సానియా ఉద్వేగంగా చెప్పుకొచ్చారు. అయితే, జాతీయ స్థాయిలో చాలా రాజకీయ పార్టీలు సానియా మీర్జాకు అండగా నిలబడ్డాయి. లక్ష్మణ్ వ్యాఖ్యలతో బిజెపి జాతీయ నాయకత్వం సైతం విభేదించడం విశేషం. సానియా భారతదేశానికే గర్వకారణమంటూ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రశంసించారు. తమ పార్టీ వైఖరి అది కాదని కూడా ఆయన పరోక్షంగా డాక్టర్ లక్ష్మణ్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. 
 
సానియా మీర్జా భారతదేశానికి గర్వకారణమైన పుత్రికగా మరో కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ అభివర్ణించారు. ఇక మజ్లిస్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ అయితే బిజెపి రాష్ట్ర నాయకులపై మండిపడ్డారు. సానియా మీర్జా తాతగారు ఆంధప్రదేశ్ అసెంబ్లీకి ఒకప్పుడు ఎమ్మెల్యేగా పనిచేశారని, ఆయనో గొప్ప కవి కూడా అన్న విషయం బిజెపి నేతలు తెలుసుకోవాలని హితవు చెప్పారు.
 
సిపిఎం ఎంపి సీతారాం ఏచూరి కూడా సానియాకు మద్దతుగా నిలిచారు. ‘‘ఆమె భారత పౌరురాలు. భారత్ తరఫున టెన్నిస్ ఆడతారు. దేశానికి ఆమె అనేక ట్రోఫీలు సాధించిపెట్టారు. ఆమె గురించి అలా మాట్లాడటం తగదు’’ అని సీతారాం అన్నారు.  
మొత్తం మీద సానియా మీర్జా నియామకం వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిస్పందించనప్పటికీ దేశవ్యాప్తంగా దాదాపు అన్ని పార్టీలూ ఆమెకు అండగా నిలబడడం విశేషం. ఇంకేముంది సానియాకు ఫుల్ సపోర్ట్ దొరకడంతో వివాదానికి తెరదించినట్లే అవుతుందని రాజకీయ పండితులు అంటున్నారు.