శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 13 సెప్టెంబరు 2015 (12:52 IST)

యూఎస్ ఓపెన్ : ఫైనల్లో తలపడుతున్న టెన్నిస్ దిగ్గజాలు రోజర్ - జొకోవిచ్

యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భాగంగా ఆదివారం టెన్నిస్ దిగ్గజాల మధ్య ఫైనల్ పోరు జరుగనుంది. సెమీస్‌లో వావ్రింకాను ఓడించిన స్విస్‌ దిగ్గజం ఫెడెక్స్‌.. డిఫెండింగ్‌ చాంప్‌ సిలిచ్‌ను ఓడించిన వరల్డ్‌ నెంబర్‌ వన్‌ జొకోవిచ్.. టైటిల్‌ ఫైట్‌కు సిద్ధమయ్యారు. వీరిద్దరి మధ్య ఇప్పటివరకు 41 మ్యాచ్‌లు జరుగగా.. ఫెడెక్స్‌ 21-20తో కాస్త మెరుగ్గా ఉన్నాడు.
 
పైగా... ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ యూస్‌ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. ఐదు సార్లు చాంపియన్‌ ఫెడరర్‌ సెమీస్‌లో 6-4, 6-3, 6-1తో సహచర ఆటగాడు స్టానిస్లాస్‌ వావ్రింకాను వరుస సెట్లలో ఓడించి తుదిపోరుకు చేరుకున్నాడు. వీరిద్దరూ పోటీ పడడం ఇది 42వ సారి. ఫైనల్లో గెలిస్తే 1970 తర్వాత అత్యధిక వయసులో యూఎస్‌ ఓపెన్‌ నెగ్గిన ఆటగాడిగా ఫెడెక్స్‌ రికార్డులకెక్కనున్నాడు. 
 
ఇక మరో సెమీస్‌లో జొకోవిచ్‌ 6-0, 6-1, 6-2తో డిఫెండింగ్‌ చాంప్‌ మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)ను చిత్తు చేసి యూఎస్‌ ఓపెన్‌లో ఆరోసారి ఫైనల్‌కు చేరాడు. ఈ ఏడాది అన్ని గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లోనూ ఫైనల్‌కు చేరుకున్న జొకో.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, వింబుల్డన్‌ నెగ్గి.. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఇక యూఎస్‌ ఓపెన్‌ నెగ్గితే జొకో ఖాతాలో పదో గ్రాండ్‌స్లామ్‌ చేరనుంది. 17 మేజర్‌ టైటిళ్లు సాధించిన ఫెడెరర్‌ 2012 వింబుల్డన్‌ తర్వాత మరో గ్రాండ్‌స్లామ్‌ నెగ్గలేదు.