శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : సోమవారం, 10 డిశెంబరు 2018 (14:10 IST)

ఎవరు గెలిచినా... బుధవారం పంచమి రోజునే ప్రమాణం...

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో ఎవరు గెలిచినా ఈ నెల 12వ తేదీ బుధవారం పంచమి రోజునే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 12వ తేదీ బుధవారం, పంచమి తిథి కావడంతో ఆ రోజే ప్రమాణం చేయాలని సీఎం పీఠంపై ఆశలు పెట్టుకున్న నేతలు భావిస్తున్నారు. 
 
నిజానికి ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి గెలిస్తే ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒకవేళ కాంగ్రెస్ సారథ్యంలోని ప్రజాకూటమి గెలిస్తే మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసే అభ్యర్థి సీఎంగా ప్రమాణం చేస్తారు. అయితే, కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై ఇప్పటివరకు స్పష్టతలేదు. 
 
అయినప్పటికీ పలువురు సీనియర్ నేతలు మాత్రం తమను సీఎం అభ్యర్థిగా ఖరారు చేస్తే బుధవారమే ప్రమాణ స్వీకారం చేయాలని ముహూర్తం పెట్టుకున్నట్టుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి కారణం బుధవారం, పంచమి తిథి కావడమే. పైగా, ఆ తర్వాత మంచి రోజులు లేకపోవడం కూడా మరో కారణంగా ఉంది. అందువల్ల ప్రజా కూటమి కనుక గెలిస్తే మంగళవారం సాయంత్రమే సీఎల్పీ భేటీని నిర్వహించి పార్టీ నేతను ఎన్నుకునే అవకాశం ఉంది.