1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : మంగళవారం, 4 డిశెంబరు 2018 (12:53 IST)

ఒక్క రోజే రూ.6 కోట్లు.. ఇప్పటికే రూ.100 కోట్లు... టి పోల్స్‌లో ధన ప్రవాహం

తెలంగాణ రాష్ట్రంలో ధనం ఏరులై పారుతోంది. మంగళవారం ఒక్కరోజే ఏకంగా రూ.6 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సోదాల్లో మొత్తం రూ.100 కోట్ల మేరకు నగదు స్వాధీనం చేసుకున్న విషయంతెల్సిందే. 
 
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. సరైన పత్రాలు చూపని నగదును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల అధికారులు చేపట్టిన తనిఖీల్లో రూ.6 కోట్లకు పైగా నగదు పట్టుబడింది. 
 
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న విషయంతెల్సిందే. ఇందులోభాగంగా, జనగామ జిల్లా పెంబర్తి చెక్‌పోస్టు దగ్గర అధికారులు తనిఖీలు చేపట్టగా ఓ కారులో తరలిస్తున్న రూ.6 కోట్ల నగదును సీజ్ చేశారు. 
 
హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళుతున్న కారును తనిఖీ చేయగా, కారు సీట్ల కింద నగదు కట్టలు దాచారు. దీంతో ఏపీ 37 సీకే 4985 నెంబరు గల కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కారుతో పాటు ఆ డబ్బు ఎవరిదన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 
అటు మంచిర్యాలలో ట్రాలీలో పైపు మాటున తరలిస్తున్న రూ.50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని బెల్లంపల్లి తెరాస అభ్యర్థి దుర్గం చిన్నయ్య డబ్బుగా గుర్తించారు. మరోవైపు వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి సమీపంలో తనిఖీలు చేపట్టగా రూ.1.17లక్షలు పట్టుబడ్డాయి.