గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : గురువారం, 22 నవంబరు 2018 (13:00 IST)

40,49,596... ఇదీ హైదరాబాద్ ఓటర్ల సంఖ్య

హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. గత ఎన్నికల కోసం ప్రకటించిన తుది జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 39.60 లక్షలు ఉండగా, ఇపుడాసంఖ్య 40.49 లక్షలకు చేరుకుంది. కొత్తగా 89 వేల ఓటర్లు చేరడంతో ఈ సంఖ్య పెరిగింది. సెప్టెంబరు 25వ తేదీన వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న వారికి ఓటు హక్కును కల్పించారు. ఆ తర్వాత అనుబంధ జాబితాను విడుదల చేసింది. ఫలితంగా ఓటర్ల సంఖ్య 40,49,596కు చేరుకుంది. 
 
గత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ నగర ఓటర్ల సంఖ్య 39,64,478. 2018 జనవరి ఒకటో తేదీని కటాఫ్ తేదీగా నిర్ణయిస్తూ ముందస్తు ఎన్నికల్లో ఓటరు నమోదుకు అవకాశం కల్పించారు. తుది జాబితా ప్రకటన అనంతరం 1.03 లక్షల దరఖాస్తులు రాగా, 89 వేలు ఆమోదించారు. 13 వేల దరఖాస్తులను తిరస్కరించారు. సాంకేతిక కారణాలతో 966 దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా ఆధారంగా వచ్చే నెల 7వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. 
 
2011 లెక్కల ప్రకారం హైదరాబాద్ జిల్లా జనాభా 39 లక్షలు. గత ఎనిమిదేళ్ళ కాలంలో ఈ సంఖ్య 50 లక్షలకు చేరిందని అంచనా. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యి మందిలో 650 మందికి ఓటు హక్కు ఉండాలి. ప్రస్తుతం దాదాపుగా 15 శాతం ఎక్కువగా నగరంలో ఓటర్లు ఉన్నారని అధికారులు చెబుతున్నారు.