శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (15:11 IST)

#BudgetSession2019 : మా నాన్న పథకాన్ని కాపీ కొట్టారు : తెరాస ఎంపీ కవిత

తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కాపీ కొట్టారని తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. శుక్రవారం లోక్‌సభలో తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ 2019-20 సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. ఇందులో చిన్నసన్నకారు రైతులకు యేడాదికి రూ.6 వేల ఆర్థిక సాయం అందిస్తామని, ఈ పథకాన్ని 2018 డిసెంబరు నుంచే అమలు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. 
 
దీనిపై ఎంపీ కవిత స్పందించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని వ్యాఖ్యానించారు. రైతుబంధు ద్వారా యేడాదికి రెండు సార్లు ప్రతి ఎకరానికి రూ.5000ల చొప్పున ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం యేడాదికి రూ.6000 మాత్రమే ప్రకటించిందని... అది కూడా మూడు విడతల్లో ఇస్తామని తెలిపిందని అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగినదే అయినా... ఈ పథకాన్ని మరింత మెరుగు పరచాల్సి ఉందన్నారు. ఐదు ఎకరాలులోపు భూమి గల రైతులకు ఏడాదికి రూ.6000 ఇస్తామని చెప్పడం వల్ల కొంతమంది రైతులకు మాత్రమే ఇది మేలు చేకూర్చుతుందన్నారు.