శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (20:09 IST)

చంద్రబాబే కాదు.. ఏ బాబు పోటీ చేసినా గెలుపు నాదే : తలసాని శ్రీనివాస్

టీడీపీ అధినేత చంద్రబాబే కాదు.. ఏ బాబు పోటీ చేసినా సనత్ నగర్ ఉప ఎన్నికల్లో గెలుపు తనదేనని తెలంగాణ రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌పై పోటీ చేసి గెలుపొందిన తలసాని ఆ తర్వాత టీడీపీతో.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెరాసలో చేరి, తెలంగాణ రాష్ట్ర మంత్రి పదవిని చేపట్టిన విషయం తెల్సిందే. అయితే, తలసాని రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే సనత్ నగర్‌ అసెంబ్లీ సీటుకు బైపోల్ జరుగనుంది.
 
ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు సీనియర్ నేతలు టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీల నుంచి పోటీ పడుతున్నారు. దీనిపై తలసాని స్పందిస్తూ.. సనత్ నగర్ నియోజకవర్గంలో చంద్రబాబు వచ్చి పోటీచేసినా తన గెలుపును అడ్డుకోలేరని అన్నారు. గ్రేటర్ హైదరాబాదులో మంచిపట్టున్న తలసాని టీఆర్ఎస్‌లోకి రాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు సినిమాటోగ్రఫీ శాఖతో పాటు వాణిజ్య పన్నుల మంత్రిత్వ శాఖ‌ను అప్పగించారు. 
 
అయితే, ఇటీవల హైదరాబాద్ నగరంలో మంచి పట్టున్న కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ తెలుగుదేశం పార్టీలో చేరతారని వార్తలు వెలువడ్డాయి. అంతేగాక, ఆయనే సనత్‌నగర్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తారని కూడా ఊహాగానాలు వెలువడ్డాయి. దీంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ పైవిధంగా వ్యాఖ్యానించినట్టు సమాచారం.