శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 27 జులై 2015 (07:31 IST)

జూపల్లి కృష్ణారావు ఓ అవినీతి బకాసురుడు : డీకే అరుణ ధ్వజం

తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుపై గద్వాల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత డీకే అరుణ ధ్వజమెత్తారు. జూపల్లి ఒక అవినీతి బకాసురుడు అని ఆరోపించారు. మంత్రి పదవిపై ప్రేమతోనే జూపల్లి కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరారని మండిపడ్డారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ... పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు అన్ని రకాల అవినీతికి పాల్పడుతూ దోచుకుంటున్నారని ఆరోపించారు. అలాంటివారికి తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
 
ఇకపోతే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్లలో పూర్తిచేస్తామంటూ సీఎం కేసీఆర్‌ చెబుతున్నారని, ఒకవేళ పూర్తి చేయలేకపోతే ఆయన ముక్కు నేలకు రాస్తారా? అని ఆమె ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయల్‌సాగర్‌ వంటి ప్రాజెక్టులు 90 శాతం పూర్తయ్యాయని, వీటికి కొంత మేర నిధులు వెచ్చిస్తే... 7.9 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని చెప్పారు. అయినా సీఎం కేసీఆర్‌ వీటి గురించి మాట్లాడకుండా పాలమూరు ఎత్తిపోతల గురించి మాట్లాడుతున్నారని, దీనిని మూడేళ్లలో పూర్తి చేయడం సాధ్యమా అని ప్రశ్నించారు. 
 
కేసీఆర్‌ ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ సమాజాన్ని మోసగిస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేసీఆర్‌ హయాంలో పూర్తి కాదని, దీనికి కేంద్రం మద్దతు లేదని, ఏపీ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. అందువల్ల కేసీఆర్ ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేరని ఆమె జోస్యం చెప్పారు.